
కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది.
శ్రీనగర్: దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దుర్ఘటన విషాదాన్ని నింపింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ల్యాండ్‌పూర్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఒక పైలట్ మృతిచెందగా, గాయపడిన మరో పైలట్‌ను మిలటరీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం.