Gopalkrishna Gandhi: విపక్షాలకు దెబ్బ మీద దెబ్బ.. గోపాలకృష్ణ గాంధీ కూడా నో

Gopalkrishna Gandhi Declines Oppositions Request To Contest In President Polls - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. ఎవరిని సంప్రదించినా మాకొద్దు బాబోయ్‌ అంటూ సైలెంట్‌గా సైడ్‌ అవుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రతిపక్ష నేతల అభ్యర్థనను మహత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాల తరుపున పోటీ చేయనని చెప్పినవారి జాబితాలో గాంధీ వరసగా మూడో వ్యక్తి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్‌ పవర్‌, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్‌ అబ్దుల్లా పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు.

ఈ మేరకు గాంధీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను అడిగారు. దీనిని నేను గౌరవంగా భావిస్తున్నాను. వారి అందరి ఆలోచనలకు నేను కృతజ్ఞుడను. కానీ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన తరువాత ప్రతిపక్షాల అభ్యర్థి.. జాతీయ ఏకాభిప్రాయాన్ని, ప్రతిపక్షాల ఐక్యతను సాధించే వ్యక్తి అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇందుకు నాకంటే మెరుగైన వారు ఉన్నారని భావిస్తున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నాయకులను అభ్యర్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

కాగా గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా నో చెప్పడంతో ఎవరినీ బరిలోకి దింపాలా? అని విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 21న విపక్ష పార్టీలు మరోసారి సమావేశం కానున్నాయి. ఈ భేటీలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధి ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top