రాజస్థాన్‌: తిరుగుబాటుపై గెహ్లాట్‌ క్షమాపణ.. రేసు నుంచి అవుట్‌! బీజేపీ స్పందన

Gehlot Likely To Quit From Congress Prez Elections BJP Satires - Sakshi

న్యూఢిల్లీ/జైపూర్‌: ఆదివారం రాత్రి జరిగిన హైడ్రామా.. రాజస్థాన్‌ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పింది. సచిన్‌ పైలట్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలన్న అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేల రాజీనామా కలకలం రేపింది. ఆపై ఇవాళంతా ఢిల్లీ పెద్దల రాజస్థాన్‌ పర్యటన నేపథ్యంలో పెద్ద హైడ్రామానే నడిచింది. అయితే ఈ పరిణామాలపై బీజేపీ నేత అమిత్‌ మాలవియా స్పందించారు. 

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కోసం అశోక్‌ గెహ్లాట్‌ నామినేషన్‌ వేస్తారో? లేదో? తెలియదు. కానీ.. ఆయన వర్గం మాత్రం సోనియా గాంధీ రాజకీయ స్థాయిని అమాంతం తగ్గించేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఎవరు అధ్యక్షుడు అయినా సరే.. బలహీనంగా ఉన్న గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తలెత్తే అవకాశాలే ఎక్కువంటూ జోస్యం​ చెప్పారు. అంతేకాదు.. తమను తాము అజేయంగా భావిస్తూ వచ్చిన గాంధీ కుటుంబం ఇప్పుడు కుప్పకూలిందని ఎద్దేవా చేశారాయన. 

గెహ్లాట్‌ క్షమాపణ!
ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌ గ్రూప్‌ రాజకీయంపై అధిష్టానం సీరియస్‌గా ఉంది. గెహ్లాట్‌ మద్దతుదారులకు ఇప్పటికే హైకమాండ్‌ నోటీసులు జారీ చేసింది.  రాజస్థాన్‌ పరిణామాలను పార్టీ సీనియర్లు అజయ్‌ మాకెన్‌, మల్లికార్జున ఖర్గేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరించారు. ఈ క్రమంలో లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా స్వయంగా గెహ్లాట్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం మధ్యాహ్నం పార్టీ కీలక నేత మల్లికార్జున ఖర్గే, గెహ్లాట్‌ను కలిసి రెబల్‌ పరిణామాలపై చర్చించారు. అయితే ఈ చర్చల్లోనే ఆయన క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల తిరుగుబాటుపై ఖర్గేకు అశోక్‌ గెహ్లాట్‌ క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని, జరిగి ఉండాల్సింది కాదని గెహ్లాట్‌.. జరిగిన పరిణామాలపై తాను కలత చెందినట్లు ఖర్గే వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఇకపై తన చేతుల్లో ఏం లేదని ఆయన పేర్కొన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక ఈ సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్‌ సీనియర్‌ కమల్‌నాథ్‌ మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్‌ ఉంది. కానీ, కమల్‌నాథ్‌ మాత్రం ఈ పరిణామాలపై పెదవి విప్పడం లేదు.

అంతేకాదు.. అధ్యక్ష పోటీ నుంచి గెహ్లాట్‌ తప్పుకోవడం కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం అందుతోంది. పార్టీలో తిరుగుబాటు కలకలం రేపడం, పైగా సీనియర్ల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. దిగ్విజయ్‌ సింగ్‌, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ ఉండే అవకాశం ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top