మరో 12 మందికి విముక్తి
న్యూఢిల్లీ: 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను ఢిల్లీ కోర్టు ఒకటి దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో మరో 12 మందిపై మోపిన ఆరోపణలను కొట్టివేసింది. ఈ మేరకు శనివారం అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లను ప్రేరేపించినందుకు ఐపీసీలోని సెక్షన్ 147 రెడ్ విత్ సెక్షన్ 109 కింద తాహిర్ హుస్సేన్‌ను దోషిగా జడ్జి ధ్రువీకరించారు. ఈ కేసులో తాహిర్ ఎదుర్కొంటున్న ఇతర ఆరోపణలను కొట్టివేస్తున్నట్లు తెలిపారు.
ఈశాన్య ఢిల్లీలోని దయాల్‌పూర్ అల్లర్ల కేసులో తాహిర్ పేరు నమోదు కాగానే ఆప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఆయన ఎంఐఎం టిక్కెట్‌పై 2025 ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఈ కేసులో తాహిర్ హుస్సేన్‌కు శిక్షను ఖరారు చేసే తదుపరి విచారణ నవంబర్ 16వ తేదీన ఉంటుందని జడ్జి ప్రవీణ్ సింగ్ తెలిపారు. కాగా, ఇదే అల్లర్ల సమయంలో నిఘా అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీ కోర్టు జూలైలో తాహిర్ హుస్సేన్, మరో నలుగురిని దోషులుగా ప్రకటించడం గమనార్హం. అప్పటి అల్లర్లలో 53 మంది చనిపోగా, పలువురు గాయాలపాలయ్యారు. తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.


