తమ ఇళ్లలోని గదులను గ్రంథాలయాలుగా మార్చిన గ్రామస్థులు
భిలార్ (మహారాష్ట్ర) కథలో నిజమైన కథానాయకులు.
ఒక గ్రామం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద భవనాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి గ్రంథాలయం ఉంటే చాలు. ఒక దేశం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద నగరాలు ఉండాల్సిన అవసరం లేదు. పుస్తకాలను ప్రేమించే పౌరులు ఉంటే చాలు. ‘భిలార్’ గ్రామం ఇందుకు నిదర్శనం. ఆ ఊరి వీధుల్లో నడుస్తుంటే గోడలు మాట్లాడతాయి. ఇళ్ల ముందర పూలకుండీలతో పాటు పుస్తకాల అలమారాలు కనిపిస్తాయి. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని అందమైన పర్వత విహార కేంద్రాలైన పంచగని, మహాబలేశ్వర్ మధ్యలో ఉన్న ఈ ప్రశాంత గ్రామం చాలాకాలంగా స్ట్రాబెర్రీ సాగుకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోని గోడలపై పుస్తకాల నుంచి ఎంపిక చేసిన భాగాలు దర్శనమిస్తూ ఉంటాయి.
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం భిలార్‌ను భారతదేశపు తొలి ‘పుస్తకాల గ్రామం’గా ప్రకటించడంతో ఈ చిన్న గ్రామం ఒక్కసారిగా పుస్తకాభిమానుల ఆకర్షణ కేంద్రంగా మారింది. సందర్శకులు గంటల తరబడి తమకు నచ్చిన పుస్తకాల్లో మునిగిపోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ, పఠన సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పుస్తక దుకాణాలు, సాహిత్య ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన బ్రిటన్‌లోని వేల్స్ ప్రాంతంలోని హే–ఆన్–వై పట్టణం ఈ ఆలోచనకు స్ఫూర్తి. ఈ భావనను మహారాష్ట్ర మరాఠీ భాషా శాఖ, రాష్ట్ర మరాఠీ వికాస్ సంస్థ ప్రతిపాదించాయి. ఈ కాలంలో ఒక గ్రామం తనను తాను పుస్తకాలతో నిర్వచించుకోవడం ఎంత గొప్ప విషయం! ఇవ్వాళ జ్ఞానం విస్తరిస్తోంది. కానీ లోతైన ఆలోచన క్రమంగా అరుదవుతోంది. అలాంటి సమయంలో భిలార్ ఒక ప్రత్యామ్నాయ స్వప్నంలా కనిపిస్తుంది.
గ్రామంలోని ఇరవై ఐదు ప్రదేశాలలో ఉన్న ప్రత్యేక పఠన కేంద్రాలలో– కవిత్వం, నవలలు, బాలసాహిత్యం, మహిళల రచనలు, చరిత్ర, పర్యావరణం, జానపద సాహిత్యం, జీవిత చరిత్రలు, ఆత్మకథలు... ఇలా ఒక్కో కేంద్రంలో ఒక్కో విభాగానికి చెందిన పుస్తకాలు ఉంటాయి. ప్రతి కేంద్రం ఒక ప్రత్యేక ప్రపంచం. పాఠకుడు తన ఆసక్తిని బట్టి ఆ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. గ్రామంలోని ఇళ్లు, పాఠశాలలు, సమావేశ భవనాలు, విశ్రాంతి స్థలాలు అన్నీ చిన్న చిన్న గ్రంథాలయాలుగా మారిపోయాయి.
భిలార్ కథలో అత్యంత అందమైన అంశం ఏమిటంటే... అది ప్రభుత్వ ప్రాజెక్టుగా మొదలై, గ్రామ ప్రజల ఉద్యమంగా మారడం. తమ ఇళ్లలోని గదులను గ్రంథాలయాలుగా మార్చిన గ్రామస్థులు నిజమైన కథానాయకులు. తెలుగు రాష్ట్రాలు ఈ ప్రయోగం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి జిల్లాలో ఒక పుస్తకాల గ్రామం ఎందుకు ఉండకూడదు? వేమన గ్రామం. గురజాడ గ్రామం. కాళోజీ గ్రామం. శ్రీశ్రీ గ్రామం. దాశరథి గ్రామం. సినారె గ్రామం... ఒక రచయిత పేరుతో కాదు, ఒక పఠన సంస్కృతి పేరుతో. భవిష్యత్తులో మన పిల్లలు ఏ ప్రపంచంలో జీవిస్తారో మనకు తెలియదు. కృత్రిమ మేధస్సు వస్తోంది. సాంకేతికత మరింత విస్తరిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం మారదు. మనిషిని మనిషిగా నిలబెట్టేది అతని ఊహాశక్తి. ఆ ఊహాశక్తికి మూలం పుస్తకాలే. అందుకే భిలార్ ఒక గ్రామం మాత్రమే కాదు, మన కాలానికి అవసరమైన ఒక సందేశం. రోడ్లు అభివృద్ధిని తీసుకురాగలవు. పరిశ్రమలు సంపదను తీసుకురాగలవు. కానీ పుస్తకాలు మాత్రమే సంస్కృతిని తీసుకురాగలవు.
– వారాల ఆనంద్, కవి–అనువాదకుడు


