డిమాండ్లు తీర్చకుంటే ట్రాక్టర్ల పరేడ్‌

Farmers to hold tractor parade on Republic Day - Sakshi

రిపబ్లిక్‌డే రోజున చేపడతాం

ప్రభుత్వానికి రైతు సంఘాల హెచ్చరిక

న్యూఢిల్లీ: ఈనెల 4న జరిగే చర్చల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చకపోతే 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ఢిల్లీ వైపు ట్రాక్టర్లతో పెరేడ్‌ చేపడతామని 40 రైతు సంఘాల కూటమి ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’హెచ్చరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రానందున తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. గణతంత్ర దినోత్సవం పెరేడ్‌ అనంతరం కిసాన్‌ పెరేడ్‌ పేరిట తమ ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని రైతు నేత దర్శన్‌ పాల్‌ సింగ్‌ చెప్పారు.

ఈ పెరేడ్‌ సమయం, మార్గాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే కేఎంపీ రహదారిపై ట్రాక్టర్‌ ర్యాలీ 6న ఉంటుందనీ, రిపబ్లిక్‌ డే పెరేడ్‌కు ఇది రిహార్సల్‌ అని చెప్పారు. వచ్చేదఫా చర్చలపై ఆశతోనే ఉన్నామని, కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని రైతుసంఘ నేత అభిమన్యుకుమార్‌ తెలిపారు. తమ డిమాండ్‌ మేరకు సాగు చట్టాలు రద్దు చేయడం లేదా తమను బలవంతంగా ఖాళీ చేయించడం మాత్రమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్‌ అని రైతు నేతలు తేల్చి చెప్పారు.

తమ డిమాండ్లలో సగానికిపైగా ఆమోదం పొందాయని చెప్పడం అబద్ధమని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించడం అందరి హక్కని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అందువల్ల తాము శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని మరోనేత బీఎస్‌ రాజేవల్‌ చెప్పారు.  ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్‌ వద్ద మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రాంపూర్‌ జిల్లా బిలాస్‌పూర్‌కు చెందిన సర్దార్‌ కశ్మీర్‌ సింగ్‌(75) శనివారం మొబైల్‌ టాయిలెట్‌లో ఉరి వేసుకుని తనువు చాలించారు. ఆయన వద్ద సూసైడ్‌ నోట్‌ లభించిందని పోలీసులు తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top