
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో ధర్నా చేస్తున్న రైతులు
బారులు తీరి అన్నదాతల అవస్థలు
రాష్ట్రవ్యాప్తంగా తోపులాటలు, ఘర్షణలు
కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్యం
సాక్షి, నెట్‌వర్క్: యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుసేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టంచుకోవడం లేదు. పైగా కూటమి నేతలు, వారి అనుయాయులకు యూరియా బస్తాలను అడ్డదారిలో అందిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర ఘటనలు ప్రభుత్వ కఠినత్వానికి, తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
⇒ విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోగీశ గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. క్యూలో ఉన్నవారికి కాకుండా టీడీపీ అనుచరులకు అడ్డదారిలో యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఓ రైతు కిందపడిపోయాడు. దీంతో కర్షకులు ఆందోళన చేయడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు.
⇒ శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం హెచ్‌ఎన్ పేట, వడ్డితాండ్ర సచివాలయ పరిధిలోని రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. ఎండలోనే గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. సగం మందికే యూరియా బస్తాలు అందాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళిలోనూ రైతులు యూరియా కోసం గ్రోమోర్ సెంటర్ వద్ద పడిగాపులు పడ్డారు.
⇒ చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. బస్తాలు తీసుకునే క్రమంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు.
⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక, తోటపల్లి రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో ఉంచి మండుటెండలో పడిగాపులు పడ్డారు. సాయంత్రం సమయంలో వర్షం పడటంతో తోటపల్లిలో వానలోనే తడిసిముద్దయ్యారు.
⇒ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సచివాలయం వద్ద రైతులు యూరి యా కోసం సోమవారం ఆందోళన చేశారు. కేవలం 40 బస్తాలు పంపిణీ చేసి ఆపేయడంతో మిగతా రైతులు సిబ్బందిని నిలదీశారు.
⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. క్యూలైన్‌లో నిరీక్షించినా యూరియా దొరక్క రైతులు నిరాశతో వెనుదిరిగారు.
⇒ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం తహసీల్దార్ కార్యాయలం వద్ద ధర్నా చేపట్టారు. టోకెన్ల జారీలోనూ అధికారులు చేతివాటం చూపుతున్నారని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారిణి గీతాకుమారి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.