సోషల్‌ మీడియాలో రచ్చ.. స్టాలిన్‌ హెచ్చరిక | EX CM DMK Stalin Key Suggestion To Party Workers | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో రచ్చ.. డీఎంకే శ్రేణులకు స్టాలిన్‌ హెచ్చరిక

May 23 2026 9:05 AM | Updated on May 23 2026 9:05 AM

EX CM DMK Stalin Key Suggestion To Party Workers

సాక్షి, చైన్నె: వీసీకే, ఐయూఎంఎల్‌లు టీవీకే కూటమి ప్రభుత్వంలో చేరడంపై డీఎంకే శ్రేణులు ఎవరూ కఠిన పదజాలంతో విమర్శలు చేయవద్దని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు నూతన మంత్రులుగా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన వీసీకే ఎమ్మెల్యే వన్నియరసు, ఐయూఎంఎల్‌ ఎమ్మెల్యే షాజహాన్‌న్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా, డీఎంకే కూటమిని వీడి వీసీకే, ఐయూఎంఎల్‌లు టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం డీఎంకే వర్గాలలో ఆగ్రహాన్ని రేపాయి. టీవీకే కేబినెట్‌లో వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీలు చేరుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే డీఎంకే ఎంపీ ఎ.రాజా ఒక వివాదాస్పద ట్వీట్‌ చేశారు. ఇందులో పైకి ఎదగడానికి నిచ్చెనగా ఉపయోగపడిన వారు, సమాజంలోని మూఢత్వాన్ని, కుల వివక్షను అంతమొందించాల్సిన ’చిరుత పులులు’ (వీసీకే పార్టీ చిహ్నాన్ని ఉద్దేశించి), కేవలం ఒక విజిల్‌’ శబ్దానికి లొంగిపోయి మద్దతు ఇస్తున్నాయంటే, పెళ్లి చేసుకున్న భర్తను పక్కనబెట్టి, వేరే చోటు వెతుక్కున్నట్లే..పెరియార్‌ సిద్ధాంతాల ప్రకారం సరైన సమయం కోసం వేచి చూద్దాం, కానీ పోరాడుతూనే ఉంటాం. విజయం మనదే అని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. 

ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో విపరీతమైన ఆగ్రహానికి దారితీసింది. అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో ఈ ట్వీట్‌ ఉందంటూ నెటిజన్లు, ఇతర రాజకీయ నాయకులు రాజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదం ముదరడంతో ఆయన ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించారు. ఆయన మరో ట్వీట్‌ చేస్తూ ‘నా ఇంటి పెరట్లోని కొబ్బరి చెట్టు అవతలి వైపునకు వంగి, ఎదురింటి వారికి కొబ్బరి నీళ్లు అందిస్తే... సాహిత్యంలో దాన్ని ముడత్తెంగు’ (వంగిన కొబ్బరి చెట్టు) అంటారు! కానీ రాజకీయాల్లో దీనికి ఏం పేరు పెట్టాలి? వర్ధిల్లాలి తమిళం అని పేర్కొన్నారు. ఈ రెండో ట్వీట్‌ కూడా ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. 

రాజా చేసిన ఈ రెండు వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేసే పనిలో పడ్డారు. తొలి ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ కావడంతో డీఎంకే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అదే సమయంలో డీఎంకే, వీసీకే వర్గాల మధ్యమాటల తూటాలు పేలడం ఉధృతమైన నేపథ్యంలోనే, పరిస్థితి మరింత చేయి దాటకుండా ఉండేందుకు డీఎంకే అధినేత స్టాలిన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ రెండు పార్టీలను సిద్ధాంత మిత్రులుగా అభివర్ణిస్తూ, తమ పార్టీ శ్రేణులకు సంయమనం హెచ్చరిక జారీ చేశారు.

స్టాలిన్‌ ట్వీట్‌లో హెచ్చరికలు
ఈ మేరకు స్టాలిన్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన మన సిద్ధాంతపరమైన మిత్రులు వన్నియరసు, షాజహాన్‌లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. తమ రాజకీయ నిర్ణయాలను తామే నిర్దేశించుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకై నా ఉంటుందని, కాబట్టి డీఎంకే కార్యకర్తలు, నాయకులు ఎవరూ కూడా ఈ తరుణంలో ఇతరులను నొప్పించేలా, బాధించేలా కఠినమైన మాటలు మాట్లాడకూడదని విజ్ఞప్తిచేశారు. మంచిని అభినందిస్తూ, లోపాలను ఎత్తిచూపే ఒక బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం పనిచేద్దాం’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement