కశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు..

Encounter on with trapped militants in Kulgam in Jmmu Kashmir - Sakshi

ఆరుగురు ముష్కరులు హతం

శ్రీనగర్‌/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో రాత్రంతా భద్రతా బలగాలతో కొనసాగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు ముష్కరులు హతం కాగా, రాజౌరీ జిల్లాలో మరొకరు మృతి చెందారు. కుల్గాం జిల్లా నెహమా ప్రాంతంలోని సమ్నో గ్రామంలో అనుమానాస్పద కదలికలపై అందిన సమాచారం మేరకు గురువారం బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టాయి.

బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. బలగాల దిగ్బంధనంలో చిక్కుకున్న ఉగ్రమూకలు రాత్రంతా కాల్పులు కొనసాగించాయి. ఉదయం కూడా కొనసాగిన కాల్పులతో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి నిప్పంటుకుంది. దీంతో, బయటకు వచ్చిన అయిదుగురూ బలగాల చేతుల్లో హతమయ్యారని కశ్మీర్‌ ఐజీపీ వీకే బిర్డి చెప్పారు. మొత్తం 18 గంటలపాటు ఎన్‌కౌంటర్‌ కొనసాగిందన్నారు.

మృతులను లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌(పీఏఎఫ్‌ఎఫ్‌), ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌)లకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వీరందరికీ వివిధ హింసాత్మక ఘటనలతో సంబంధముందని తెలిపారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నాలుగు ఏకే రైఫిళ్లు, రెండు పిస్టళ్లు, నాలుగు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటన.. రాజౌరీ జిల్లా బుధాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బెహ్రోటే ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని ఒక ముష్కరుడు హతమయ్యాడు. సంఘటనా ప్రాంతంలో ఏకే–47 రైఫిల్, మూడు గ్రెనేడ్లు లభించాయి. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో సోదాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top