భారత్‌లో జననాల రేటుపై ఎలన్ మస్క్ సంచలన పోస్ట్‌ | Elon Musk Flags India Declining Birth Rate: Fallen Below Replacement Level | Sakshi
Sakshi News home page

భారత్‌లో జననాల రేటుపై ఎలన్ మస్క్ సంచలన పోస్ట్‌

Jun 7 2026 8:54 AM | Updated on Jun 7 2026 5:05 PM

Elon Musk Flags India Declining Birth Rate: Fallen Below Replacement Level

ఇటీవల కాలంలో భారతదేశంలో పడిపోతున్న జననాల రేటును ప్రముఖ బిలియనీర్‌ ఎలన్ మస్క్ ఎత్తిచూపారు. సంతానోత్పత్తి రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక పెద్ద హెచ్చరిక అంటూ ట్వీట్‌ చేసిన ఆయన.. దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. వివరాలతో డేటాను కూడా షేర్ చేశారు. జనాభా పరిమాణాన్ని స్థిరంగా ఉంచడానికి అవసరమైన స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఉన్నత విద్యావంతుల్లో భారతదేశ జననాల రేటు చాలా ఏళ్ల క్రితమే భర్తీ స్థాయి కంటే తగ్గిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే కిందకు పడిపోయింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశ ప్రస్తుత టి.ఎఫ్.ఆర్ 1.9 శాతానికి క్షీణించింది. దీర్ఘకాలికంగా దేశంలో జననాల రేటు తగ్గుముఖం పడుతోందనే వాస్తవానికి ఈ నివేదిక అద్దం పడుతోంది.

వలసలతో సంబంధం లేకుండా, ఒక తరం నుండి తదుపరి తరానికి జనాభా స్థిరంగా (తగ్గకుండా లేదా పెరగకుండా) కొనసాగడానికి అవసరమైన సగటు సంతానోత్పత్తి రేటును 'రీప్లేస్‌మెంట్ స్థాయి' అంటారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీనిని 2.1 గా పరిగణిస్తారు. భారతదేశ టీఎఫ్‌ఆర్‌ ఇప్పుడు 1.9 కి పడిపోవడం అంటే దేశం క్రమంగా స్థిరమైన జనాభా నిర్మాణం వైపు దూసుకుపోతోందని అర్థం. 

జాతీయ సగటు 1.9 గా ఉన్నప్పటికీ.. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య జనాభా పరంగా పెద్ద వ్యత్యాసమే కనిపిస్తోంది. అత్యధిక టీఎఫ్‌ఆర్‌ కలిగిన రాష్ట్రంగా బిహార్ (2.9) ఉండగా.. అత్యల్ప టీఎఫ్‌ఆర్‌ కలిగిన ప్రాంతంగా ఢిల్లీ (1.2)  ఉంది. గత దశాబ్దంలో ఢిల్లీ అత్యంత వేగంగా పతనాన్ని నమోదు చేయగా.. బిహార్‌లో చాలా నెమ్మదిగా తగ్గుదలను చూపిస్తోంది.

దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సంతానోత్పత్తి రేటు అత్యంత ఆందోళనకరంగా 1.4 నుండి 1.6 మధ్యకు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇది ఏకంగా 1.2 కి తగ్గిపోయింది. అయితే, దీనికి భిన్నంగా ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ రేటు రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే అధికంగానే నమోదు అవుతుండగా.. దేశవ్యాప్తంగా సగటు రేటు పడిపోతుండటం వల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గి పోవడం... వృద్ధుల జనాభా భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement