Yakub Memons: యాకూబ్‌ మెమన్‌ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం

Eknath Shinde Said That Investigation Inquiry Grave Of Yakub Memon - Sakshi

ముంబై: ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమన్‌ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.  ఒక నిందితుడి సమాధిని సుందరీకరించడంపై పెనువివాదం చెలరేగింది. ఈ విషయమై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ముంబై పోలీసులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరిపించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై సత్వరమే విచారణ చేసి నివేదికను కూడా సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ మాట్లాడుతూ...పాక్‌ ఆదేశానుసారం ఉగ్రవాది యాకూబ్‌ మెమన్‌ 1993లో ముంబైలో పేలుళ్లును అమలు చేశాడు.

అలాంటి వ్యక్తి సమాధిని ఉద్ధవ్‌ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే మజార్‌గా మార్చారని ఆరోపణలు చేశారు. ఇదేనా ఆయనకు ముంబైపై ఉన్న ప్రేమ, దేశభక్తి అని ప్రశ్నించారు. దీనికి థాక్రే క్షమాపణలు చెప్పలంటూ డిమాండ్‌ చేశారు. అలాగే నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని కోరారు.

వాస్తవానికి మార్చి12, 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సుమారు 257 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసులో యాకుబ్‌ మెమన్‌కి ఉరిశిక్ష పడింది కూడా.

(చదవండి: అమిత్‌ షాపై ట్రోల్స్‌... 'ఇండియా బిగ్గెస్ట్‌ పప్పు' అంటూ...)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top