లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుపాన్ రాబోతుందన్నారు. ప్రజలందరూ భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదని మోదీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చుతాయని తెలిపారు. రాయిబరేలీలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. సామాన్యులంతా ఆర్థిక భారం ఎదుర్కొక తప్పదని బిలియనీర్ల కోసం మోదీ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేశారన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "గత కొన్ని రోజులుగా దేశ ప్రజలకు నేను సూచన చేస్తూ వస్తున్నాను. అంబానీ- అదానీ వ్యవస్థ ఎక్కువ కాలం నిలవదు. అది త్వరలోనే కుప్పకూలిపోతుంది. ఈ సంక్షోభం సామాన్య ప్రజలపైనే అధికంగా ఉంటుంది. ఇటువంటి కష్ట సమయంలో చర్యలు తీసుకోవడానికి బదులుగా నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేపడుతున్నారు." అని రాహుల్ అన్నారు.
కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలంతా దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని ఏడాదిపాటు బంగారం కొనకూడదని విజ్ఞప్తి చేశారు. కాగా హర్ముజ్ జలసంధి మూసివేతతో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో పెట్రో,డీజిల్ ధరలను ఇటీవలే ప్రభుత్వం పెంచింది.


