బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే ఆయనకు షాక్ తగిలింది. నూతన మంత్రి వర్గంలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ చర్యలతో శివకుమార్‌కు ఆదిలోనే హంసపాదు తగిలినట్లయింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్... సీఎం కుర్చీ కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివరలో మెుదలైన ఈ రాజకీయ రగడ ఎట్టకేలకు శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో శాంతించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన క్యాబినెట్ విస్తరణలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీంతో శివకూమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ఈ అంశమై డీకేశివకుమార్ మాట్లాడుతూ.. "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. కేబినెట్‌లో మేమే అత్యంత సన్నిహిత మిత్రులం. ఈ సమస్యను పరిష్కరిస్తాం. రామలింగారెడ్డి నా సహచరుడు, మా సీనియర్ నాయకుడు. ఆయన గ్రామానికి వెళ్లి పని చేయలేనని చెప్పారు. నాకు వేరే మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. నేను రామలింగారెడ్డితో మాట్లాడి అంతా సరిచేస్తాను," అని డీకే చెప్పుకొచ్చారు.

కాగా బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్‌లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని వివరణ ఇచ్చారు. తాజాగా డీకే సీనియర్ నేతను బుజ్జగించే యత్నం చేస్తున్నట్లు సమాచారం.


