ఈవీఎంలతోనే బీజేపీ గట్టెక్కింది : దిగ్విజయ్‌ సింగ్‌

Digvijay Blames EVMs In Madhya Pradesh Bypolls - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్ధానాలను బీజేపీ కైవసం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చింది. కాషాయ పార్టీ విజయంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈవీఎంల మాయాజాలంతోనే బీజేపీకి భారీ విజయం దక్కిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. చిప్‌తో కూడిన ఎలాంటి మిషన్‌ను అయినా హ్యాక్‌ చేయవచ్చని వ్యాఖ్యానించారు. అగ్రదేశాలు సైతం బ్యాలెట్‌ పేపర్లనే వాడుతున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోందని దిగ్విజయ్‌ పేర్కొన్నారు.

విపక్షాలు సాధించిన విజయాలు చూపుతూ ఈవీఎంల పనితీరును బీజేపీ సమర్ధించుకుంటోందని, ఈవీఎంలను ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే తారుమారు చేస్తారని తాను చెప్పగలనని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కమల్‌ నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్ర ప్రజలను వంచించారని మధ్యప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ వీడీ శర్మ మండిపడ్డారు. ఇక మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకూ 9 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ మరో పదిస్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కేవలం ఒక స్ధానంలో విజయం సాధించిన కాంగ్రెస్‌ మరో ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. మొరెనా స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. కాగా తమ పార్టీ నేతల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. చదవండి : ఉప ఎ‍న్నికల్లో బీజేపీ హవా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top