
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబై: భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం, అతడిని బహిరంగంగా అవమానించడం, మానసికంగా వేధించడం ముమ్మాటికీ క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో భార్యతో విడాకులు తీసుకొనే హక్కు అతడికి ఉంటుందని స్పష్టంచేసింది. భార్య చేతిలో వేధింపులకు గురైన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ పుణే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది.
పుణేకు చెందిన యువతీ, యువకుడు 2013లో పెళ్లి చేసుకున్నారు. 2014లో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఆ యువకుడు పుణే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్య తనతో శృంగారానికి ఒప్పుకోవడం లేదని, బంధువులు, స్నేహితుల ముందు అవమానిస్తోందని, దివ్యాంగురాలైన తన సోదరిని వేధిస్తోందని పేర్కొన్నాడు.
అతడి వాదనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ 2015లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ యువకుడి భార్య బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు విడాకులు అవసరం లేదని, భర్త నుంచి ప్రతినెలా రూ.లక్ష ఇప్పించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. భార్య పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బంధువులు, స్నేహితుల ముందు భర్తను అవమానించడం, అతడితో శృంగారానికి ఒప్పుకోకపోవడం, దివ్యాంగురాలైన సోదరిని వేధించడం వంటివి అతడిని మానసికంగా తీవ్ర అశాంతికి గురి చేశాయని పేర్కొంది. దంపతులు ఇక కలిసి ఉండేందుకు ఆస్కారం లేదని, వారికి విడాకులు మంజూరు చేయడం సమంజసమేనని తేల్చిచెప్పింది.