ఎవరినీ వదలం: ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌

Delhi Police Commissioner SN Srivastava Briefs Media On R-Day Violence - Sakshi

‘ట్రాక్టర్‌ పరేడ్‌ను అనుమతించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో నిర్వహించలేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. దోషులెవరినీ వదలం’అని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. ఢిల్లీ ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు అత్యంత సంయమనం పాటించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఆందోళనకారులు పోలీసుల నుంచి టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించేందుకు వాడే తుపాకులను లాక్కున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ తరహా తుపాకీ ఎర్రకోటలో ఒక ఆందోళనకారుడి దగ్గర కనిపించిందన్నారు.

ఎర్రకోటలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆందోళనకారుల్లో కొందరు మద్యం సేవించారని, కత్తులు, పదునైన ఆయుధాలతో తమపై దాడి చేశారని కేసు విచారిస్తున్న నార్త్‌ ఢిల్లీ డీసీపీ సందీప్‌ తెలిపారు. అక్కడ హింసకు పాల్పడుతున్న సమూహాన్ని నియంత్రించడం తమకు కష్టమైందన్నారు. అయితే, ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులను 3 గంటల్లో అక్కడి నుంచి పంపించివేశామన్నారు. కాగా, తాజాగా ఎర్రకోట వద్ద ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సహా ఇతర భద్రతా దళాలను బుధవారం భారీగా మోహరించారు. డ్రోన్‌ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నకిలీవార్తల కట్టడికి ట్విట్టర్‌ రంగంలోకి దిగింది. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తున్నాయన్న అనుమానంతో సుమారు 550 ఖాతాలను ట్విట్టర్‌ తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది.

ప్రజా ఉద్యమంగా మారింది: బి. వెంకట్‌
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. ఈ చట్టాలతో రైతులతో పాటు యావత్తు ప్రజానీకానికి నష్టం కలుగుతుందని ఆయన బుధవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో వ్యాఖ్యానించారు. చట్టాల రద్దుకై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేస్తే కేంద్రప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులంతా ఈ చట్టాల రద్దు కోసం కృషి చేయడం రైతు ఉద్యమానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top