అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌! | Delhi Incident: final moments filled with fear Agarwal Family Last Call | Sakshi
Sakshi News home page

చివరి క్షణాల్లో ప్రాణభయంతో.. అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్‌

Jun 4 2026 9:29 AM | Updated on Jun 4 2026 9:41 AM

Delhi Incident: final moments filled with fear Agarwal Family Last Call

ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్‌గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. 

సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్‌లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్‌గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.

ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్‌లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.

తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్‌లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.

ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక దర్యాప్తులో హోటల్‌లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.

అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్‌మెంట్‌లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement