బిడ్డ చదువు బాధ్యత తండ్రిదే

Delhi HC Says Father Responsibilities Don not End at Son education - Sakshi

మేజర్‌ అయ్యాడని తప్పించుకోలేరు.. 

ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కుమారుడికి 18 ఏళ్ల వయసు నిండింది, మేజర్‌ అయ్యాడు కదా అని తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోలేడని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బిడ్డకు చదువులు చెప్పించాలి్సన బాధ్యత ఎప్పటికీ తండ్రిదేనని, ఆ ఆర్థిక భారాన్ని తల్లిపై వేయకూడదని పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఒక జంట విడాకులు తీసుకున్నాక కుమారుడి చదువు కోసం తండ్రి నెలకి రూ.15 వేలు చెల్లించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పుని పునఃసమీక్షించాలంటూ ఆ భర్త మళ్లీ కోర్టుకెక్కాడు. తన కుమారుడికి 18 ఏళ్ల వయసు వచ్చేవరకు, లేదంటే అతడి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యే వరకు మాత్రమే చదువు కోసం తాను డబ్బులు ఇస్తానని, ఆ తర్వాత ఇవ్వలేనంటూ పిటిషన్‌ వేశాడు. ఆ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ విచారణ చేపట్టారు. తండ్రి తన కుమారుడి చదువు బాధ్యతల నుంచి తప్పించుకోలేరంటూ పిటిషన్‌ను కొట్టేశారు. ‘‘పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడేవరకు, సమాజంలో ఒక గుర్తింపు వచ్చేలా ఎదిగేవరకు వారి బాధ్యతను తండ్రి స్వీకరించాలి. కొడుక్కి 18 ఏళ్లు నిండాయని అతని చదువులకయ్యే ఆర్థిక భారాన్ని తల్లిపై వేయకూడదు.

కుమారుడు మేజర్‌ అయినంత మాత్రాన అతను ఆర్థికంగా స్వతంత్రుడు కావాలన్న నిబంధన లేదు. కుమారుడు ఆర్థికంగా తల్లికి అంది వచ్చేవరకూ అతని బాధ్యత తప్పనిసరిగా తండ్రిదే. అతను ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. 1997లో వివాహమైన ఢిల్లీకి చెందిన జంటకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2011లో మనస్పర్థలతో వారు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు కుమారుడికి 20 ఏళ్లు, కుమార్తెకి 18 ఏళ్లు వచ్చాయి. విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు కొడుక్కి 18 ఏళ్లు వచ్చేవరకు, కూతురుకి ఉద్యోగం లేదా పెళ్లి జరిగేవరకు పోషణ భారం తండ్రిదేనని తీర్పు చెప్పింది. అయితే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో క్లర్కుగా ఉన్న ఆ తల్లి తాను తన జీతంతో కొడుక్కి చదువు చెప్పించలేనంటూ హైకోర్టుకెక్కితే చదువు నిమిత్తం తండ్రి నెలకి రూ.15 వేలు ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది.  బాధ్యతల నుంచి పారిపోవద్దంటూ ఆ తండ్రిని కోర్టు హెచ్చరించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top