
విజయవంతంగా అమర్చిన ఢిల్లీ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు
సాధారణ పేస్‌మేకర్ కంటే ఎంతో ఉపయుక్తం
కోత, కుట్లు అవసరం లేకుండానే అమర్చే వీలు
న్యూఢిల్లీ: గుండె పనితీరును క్రమబద్ధం చేసేందుకు అమర్చే పేస్‌మేకర్ సర్జరీల్లో ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ సరికొత్త చరిత్ర లిఖించింది. దేశంలో తొలిసారి ఓ రోగికి ‘డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్’(డీసీఎల్‌పీ)ను విజయవంతంగా అమర్చినట్లు మంగళవారం ప్రకటించింది. సాధారణ పేస్‌మేకర్లు అమర్చేందుకు రోగికి ఛాతీ భాగంలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. పైగా దానికి వైర్లతో బయటి యంత్రానికి అనుసంధానం చేసి గుండె స్పందనలను క్రమబద్ధం చేయాల్సి ఉంటుంది. డ్యూయల్ చాంబర్ లీడ్‌లెస్ పేస్‌మేకర్లతో ఆ అవసరం ఉండదు.
ఇవి చిన్న క్యాప్సూల్ మాదిరిగా ఉంటాయి. వాటిని గుండె పై కర్ణికలో ఒకటి, కింది దమనికలో ఒకదానిని అమరుస్తారు. ఇందుకోసం పొట్టలోకి కృత్రిమంగా ఆహారాన్ని పంపే ఓ గొట్టంలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల శస్త్రచికిత్సతో పని ఉండదు. ఈ క్యాప్సూల్స్‌కు వైర్లు ఉండవు. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి ఈ పరికరాలు రెండు వాటంతట అవే సమాచార మారి్పడి చేసుకుంటాయి. గుండె సాధారణంకంటే వేగంగా కొట్టుకోవటం ప్రారంభించగానే ఇవి పనిచేయటం మొదలుపెట్టి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే గుండె వేగం సాధారణంకంటే తగ్గితే వెంటనే కృత్రిమంగా వేగాన్ని పెంచుతాయి.
83 ఏళ్ల వ్యక్తికి...
మ్యాక్స్ హాస్పిటల్‌లో 83 ఏళ్ల ఓ రోగికి వీటిని అమర్చారు. ఆస్పత్రి కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ బల్బీర్‌సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ అరుదైన చికిత్స నిర్వహించింది. ఆ రోగికి గుండెలో కర్ణిక, దమనికల మధ్య సమన్వయం లోపించటంతో గుండె వేగం సాధారణంకంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు కారణాల రీత్యా సాధారణ పేస్‌మేకర్ చికిత్స సరికాదని గుర్తించి డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్ అమర్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించాయి.