త్రివిధ దళాధిపతులతో రాజ్‌‌నాథ్‌ భేటీ

Defence Minister Held A Meeting With The CDS - Sakshi

సైనికాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రక్షణ దళాల చీఫ్‌ (సీడీఎస్‌)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితిని సమీక్షించారు. తూర్పు లడఖ్‌లో సుదీర్ఘంగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ వి మధ్య గురువారం మాస్కోలో కీలక భేటీ అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సరిహద్దు వెంబడి పరిస్థితితో పాటు చైనా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జై శంకర్‌ చేపట్టిన చర్చల సారాంశాన్ని సమీక్షించారు.

భారత్‌-చైనా సైనిక కమాండర్ల స్ధాయి చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరించడంపై గురువారం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ అన్నిటికీ కట్టుబడాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉంటూ శాంతి సామరస్యం కొనసాగేలా చూడాలని పంచసూత్ర ప్రణాళికలో నిర్ణయించారు. మరోవైపు తూర్పు లడఖ్‌లో డ్రాగన్‌ సేనలు భారీగా మోహరించడంతో భారత దళాలూ అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు చుషుల్‌లో శుక్రవారం కొనసాగాయి. చదవండి : భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top