పదిరోజుల్లోనే 79 వేల కేసులు

Covid Cases Are Rising So Fast In Maharashtra - Sakshi

రాష్ట్రంలో ఆందోళనకరంగా కరోనా వ్యాప్తి 

సెకండ్‌ వేవ్‌ తగ్గిందనుకుంటున్న సమయంలో పెరుగుతున్న కేసులు

ముంబై సెంట్రల్‌: మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ తగ్గిందని భావిస్తున్న తరుణంలో గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా రెండో వేవ్‌ ప్రారంభమై దాదాపు 6 నెలలు కావొస్తుంది. అయినా మహారాష్ట్రలో కరోనా నియంత్రణలోకి వచ్చినట్లుగా లేదు. పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేస్తోంది. 

వ్యాక్సినేషన్‌ ఇచ్చినా.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పెద్ద ఎత్తున జరిగిందని భావిస్తున్న కొల్హాపూర్‌ జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొల్హాపూర్‌లో అత్యధిక వాక్సినేషన్‌ జరిగినప్పటికీ కేసులు ఎందుకు తగ్గడం లేదో అర్థం కావడం లేదని ప్రముఖ డాక్టర్‌ శశాంక్‌ జోషి అందోళన వ్యక్తం చేశారు. మరో 8 జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోనట్లయితే మూడో వేవ్‌ రావొచ్చని మరో డాక్టర్‌ గిరిధర్‌ బాబు హెచ్చరించారు.

దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రల్లోని కేసులు దాదాపు 53 శాతం ఉన్నాయి. కరోనా రెండో వేవ్‌లో ఢిల్లీలో ఒకప్పుడు 25 వేల కేసుల వరకు పెరిగిపోయాయి. కానీ, ఇప్పుడు ఢిల్లీ పూర్తి నియంత్రణలోకి వచ్చింది. జూలై 1 నుంచి జూలై 10 వరకు ఢిల్లీలో కేవలం 817 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. దేశంలోని పలు నగరాల్లో కొత్త కేసుల సంఖ్య రెండు డిజిట్లు దాటడం లేదు. కానీ, ముంబైలో మాత్రం ఐదు వందల నుంచి వేయిలోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో కరోనా నియంత్రణలోకి రాకపోవడం వెనక ఉన్న కారణాలను ప్రభుత్వం కనుగొంటోంది. కానీ, ఇంత వరకు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. మహారాష్ట్ర తర్వాత కేరళలో కూడా అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. కరోనా కేసులు పెరుగుదల చూస్తోంటే త్వరలోనే మహారాష్ట్ర మూడో వేవ్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top