తమిళ సినిమా (చెన్నై): జననాయకన్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ.. ఆ సినిమాను సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నాయి. విజయ్ కథానాయకుడిగా, హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిరి్మంచిన చిత్రం జననాయకన్ సినిమాను చిక్కులు చుట్టుముడుతున్నాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఆడియో వేదికపై విజయ్ మాట్లాడుతూ.. ‘నా చిత్రాలకు ఉత్తి పుణ్యానే సమస్యలు ఎదురవుతాయి. వాటిని మీరు ఎదురొడ్డి నిలబడగలరా’ అని నిర్మాతను అడిగినట్టు చెప్పారు.
ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారోగానీ.. జననాయకన్ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఇప్పటివరకూ పరిష్కారం రాలేదు. ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ రూపంలో ఈ చిత్ర నిర్మాతకు మరో ఇబ్బంది తలెత్తింది.
విజయ్ చిత్రం కావడంతో దీని ఓటీటీ హక్కులను భారీ మొత్తంలో చెల్లించి అమెజాన్ సంస్థ కొనుగోలు చేసింది. సాధారణంగా చిత్రం విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ చేస్తాయి. అలాంటి ఒప్పందమే జననాయకన్ చిత్ర నిర్మాతతో అమెజాన్ సంస్థ కుదుర్చుకుంది. ఈ చిత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడంతో అమెజాన్ సంస్థ చిత్ర నిర్మాత నుంచి నష్టపరిహారం కోరడానికి సిద్ధమైనట్టు సమాచారం.


