కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు: అనుకున్నట్లే.. ఆయన నామినేషన్‌ తిరస్కరణ

Congress Senior Leader KN Tripathi Nomination Rejected - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్‌ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ  పరిశీలన కూడా పూర్తైంది. అయితే అందులో నుంచి ఓ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేఎన్‌ త్రిపాఠి(45) నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్‌ మధుసుదన్‌ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్‌ పత్రాల సెట్‌ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్‌ వెల్లడించారు. దీంతో బరిలో సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత శశిథరూర్‌లు నిలిచారు.

కేఎన్‌ త్రిపాఠి.. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే. జార్ఖండ్‌ మాజీ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(సొంత వర్గం)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పని చేసిన త్రిపాఠి.. 2019 జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల టైంలో  వార్తల్లో ప్రముఖంగా నిలిచాడీయన. కోషియారా గ్రామంలో బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టగా.. తుపాకీతో కాల్పులకు దిగాడు. అయితే ఆ పరిణామం ఆయనకేం సహకరించకపోగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. మావో ప్రభావిత పాలము జిల్లాకు చెందిన త్రిపాఠి.. లైసెన్స్‌ రివాల్వర్‌ కలిగి ఉన్నారు. ప్రాణహని నేపథ్యంతో ఎన్నికల టైంలోనూ ఆయన ఆ తుపాకీని అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. 

ఇదిలా ఉంటే.. 2009లో దాల్టోన్‌గంజ్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. అదృష్టవశాత్తూ 2014లో త్రిపాఠికి మంత్రి బెర్త్‌ దక్కింది. దీంతో రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయత్‌ రాజ్‌, లేబర్‌ మినిస్టర్‌గా పని చేశారు. 

శుక్రవారం నామినేషన్ల సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. తాను రైతు బిడ్డను మాత్రమే కానని, సోనియాకు కూడా కొడుకు లాంటి వాడినేనంటూ ఉపన్యాసం దంచాడు. అందుకే పార్టీ టాప్‌ పోస్ట్‌కు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు హైకమాండ్‌ ఏం చెబితే.. అది పాటిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆయన నామినేషన్‌ వేసి వచ్చిన కాసేపటికే పార్టీలో చర్చ నడిచింది. 

త్రిపాఠి బరిలో నిలవాంటే.. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్‌ చివరి వరకు ఉంటుందా? అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆయన నామినేషన్‌ చివరకు తిరస్కరణకు గురైంది.  ఇక కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్టోబర్‌ 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, ఆ తేదీ నాటికి ఒక ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని మధుసుదన్‌ మిస్ట్రీ తెలిపారు. అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 19వ తేదీన కౌంటింగ్‌ ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top