భారత్‌ జోడో యాత్ర @ 100 రోజులు: మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి?

Congress Party Bharat Jodo Yatra completes 100 days - Sakshi

జైపూర్‌: భారత్‌ దక్షిణ కొన నుంచి ఒక్క అడుగుతో మొదలైన కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర వడివడిగా ముందుకు సాగుతూ శుక్రవారం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. కన్యాకుమారినుంచి కశ్మీర్‌దాకా సాగే 3,500 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ యాత్రలో రాహుల్‌కు మద్దతుగా అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే ఈ ప్రజాదరణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుబ్యాంక్‌ను పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఈ తరుణంలో ఇటీవల ముగిసిన గుజరాత్, హిమాచల్‌ శాసనసభ ఎన్నికలు పార్టీకి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అయితే, యాత్ర ఫలితం వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో చూస్తే యాత్ర.. పార్టీకి పూర్వవైభవాన్ని తెస్తుందని ఒకప్పటి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ ఝా విశ్లేషించారు. ‘ ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్‌ మరోసారి క్షేత్రస్థాయిలో బలపడుతోంది.

తన ఇమేజ్‌పై బీజేపీ కురిపిస్తున్న నకిలీ, తప్పుడు కథనాలను పటాపంచలు చేస్తూ కొత్త రాజకీయ బ్రాండ్‌గా రాహుల్‌గాంధీ ఎదుగుతున్నారు’ అని ఆయన అన్నారు. కాగా, యాత్రలో రాహుల్‌ ఆహార్యం, విమర్శలపై కాంగ్రెస్, బీజేపీ వాగ్భాణాలు సంధించుకున్నాయి. నెరిసిన గడ్డంతో ఇరాన్‌ నియంత సద్దాం హుస్సేన్‌లా ఉన్నాడంటూ రాహుల్‌పై బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం, వివాదాస్పద క్రైస్తవ బోధకుడితో రాహుల్‌ భేటీ, పాదయాత్రకు కోట్లాది మంది ప్రజానీకం మద్దతు వంటి భిన్న అంశాలతో పాదయాత్ర ముందుకుసాగుతోంది.

మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి?
దౌసా: చైనా సైనికుల చొరబాటు యత్నంపై చర్చించకుండా మోదీ సర్కార్‌ తప్పించుకుంటోందని కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం చీఫ్‌ పవన్‌ ఖేరా ఆరోపించారు. రాజస్తాన్‌లో భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా దౌసాలో మీడియాతో మాట్లాడారు. ‘చైనా అంశంలో ప్రధాని మోదీ మౌనం వెనుక ఉద్దేశమేంటి? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చైనాకు క్లీన్‌చిట్‌ ఇస్తారు. మోదీ గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చైనా మాండరీన్‌ భాషను ప్రవేశపెట్టాలనుకున్నారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగేలా జమ్మూకశ్మీర్‌ సరిహద్దు జిల్లాల్లో స్మార్ట్‌మీటర్లు బిగించే బాధ్యత మోదీ ఒక చైనా కంపెనీకి కట్టబెట్టారు.  గుజరాత్‌లో స్థానిక సంస్థలను కాదని చైనా కంపెనీలకు భూమి కేటాయించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌కు చైనా కంపెనీలు విరాళాలు పంపాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందే ’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top