చెన్నై: తమిళనాడులో ఉప ఎన్నికల విజయం ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు రాజకీయంగా కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ధారాపురం, మదురాంతకం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో అసెంబ్లీలో టీవీకే బలం 107 నుంచి 109కి పెరిగింది. ఈ విజయాలపై హర్షం వ్యక్తం చేసిన విజయ్.. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వారికి, వ్యక్తిగత దూషణలకు దిగిన వారికి, రాజకీయ ద్రోహానికి పాల్పడిన వారికి ప్రజలు గట్టి సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు.
డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయకుండానే ప్రజల మద్దతు సాధించామని పేర్కొన్నారు. ధారాపురంలో టీవీకే అభ్యర్థి పి. సత్యబామ, మదురాంతకంలో మరగతం కుమారవేల్ విజయాలు సాధించడంపై విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు తన వ్యక్తిగత విజయమో, పార్టీకి మాత్రమే దక్కిన విజయమో కాదని పేర్కొన్నారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలకు, వ్యక్తిగత దూషణలకు, విశ్వసనీయ నాయకులు, కార్యకర్తలకు ద్రోహం చేసిన వారికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. ప్రచార సమయంలో సత్యబామపై చేసిన వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. అలాగే, పార్టీ మారిన అభ్యర్థులను విమర్శించిన అన్నాడీఎంకే తీరునూ ప్రశ్నించారు. ఈ విజయాలు రాజకీయ మర్యాదకు, వ్యక్తిగత గౌరవానికి, ప్రజాస్వామ్యానికి, అన్నింటికంటే ఓటర్ల తీర్పుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ విజయాలు పార్టీకి రాజకీయంగా ఊపునిచ్చినా.. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీని మాత్రం అందించలేదు. అసెంబ్లీలో సంఖ్యాబలం, మిత్రపక్షాల మద్దతు, ఎన్నికల హామీల అమలు.. ఇలా విజయ్ సర్కారు ముందున్న సవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి.
మెజారిటీ కష్టాలు తప్పవా?
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజా విజయాలతో టీవీకే బలం 109కి చేరినా.. మెజారిటీకి ఇంకా తొమ్మిది స్థానాల దూరంలోనే ఉంది. తిరుచ్చి ఈస్ట్, కరూర్, విరాలిమలై, పెరుందురై, అంబాసముద్రం స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు స్థానాలనూ టీవీకే గెలుచుకున్నా పార్టీ బలం 114కే చేరుతుంది. అంటే సొంతంగా మెజారిటీ సాధించాలంటే మరో నాలుగు స్థానాలు తక్కువవుతాయి. ఇతర మద్దతుదారుల సహకారం కొనసాగితే ప్రభుత్వం మెజారిటీని నిలబెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, సంఖ్యాబలం విషయంలో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అందుకే తాజా విజయాలను ప్రభుత్వ స్థిరత్వానికి పూర్తి భరోసాగా చూడలేని పరిస్థితి ఉంది.
కూటమి సమన్వయమే కీలకం
ప్రభుత్వ ఏర్పాటులో ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతు టీవీకేకు కీలకంగా మారింది. గతంలో డీఎంకేతో కలిసి పనిచేసిన కాంగ్రెస్.. ఎన్నికల అనంతరం విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వీసీకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. టీవీకే మిగిలిన ఐదు స్థానాలనూ గెలుచుకుని, ఇతర మిత్రపక్షాల మద్దతు కొనసాగితే కాంగ్రెస్ లేకుండానూ మెజారిటీ సాధ్యమయ్యే పరిస్థితి ఉండొచ్చు. అయినప్పటికీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర మిత్రపక్షాల రాజకీయ ప్రయోజనాలను సమన్వయం చేసుకోవడం విజయ్‌కు ముఖ్యమైన బాధ్యత. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్, సంక్షేమ పథకాలు, కీలక నిర్ణయాల విషయంలో కూటమి ఏకాభిప్రాయాన్ని సాధించడం అవసరం. తాజా విజయాలు పార్టీకి ఊరటనిచ్చినా, ఆ విజయాలను పాలనా విజయాలుగా మార్చుకోగలిగితేనే టీవీకేకు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం దక్కనుంది.
ఇదీ చదవండి: సీజేపీ ధర్నా ఎఫెక్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు!


