కుటుంబీకులను తప్పుపట్టిన గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌

CM Pramod Sawant Shocking Comments On Girls Molested In Beach - Sakshi

పనాజీ: గోవాలో బాలికలపై అత్యాచారం సంఘటనపై అధికార పక్షంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ప్రస్తావించగా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధితుల కుటుంబసభ్యుల తీరును తప్పుబట్టారు. అర్ధరాత్రి పిల్లలను బయటకు ఎందుకు పంపాలి? బీచ్‌లో వారికేం పని? సీఎం ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. 

జూలై 24వ తేదీన రాజధాని పనాజీకి 30 కిలో మీటర్ల దూరంలోని కోల్వా బీచ్‌లో ఓ పార్టీ జరిగింది. మొత్తం పది మంది బాలబాలికలు హాజరయ్యారు. పార్టీ అయిపోయాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లారు. మిగతా నలుగురిలో ఇద్దరు చొప్పున అమ్మాయిఅబ్బాయిలు రాత్రంతా బీచ్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వారు కొందరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గోవాలో సంచలనంగా మారింది. 

తాజాగా బుధవారం (జూలై 28) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు అత్యాచారం అంశంపై చర్చకు ప్రతిపాదించారు. ఈ చర్చలో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ పై వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా? వారి బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదు’ అని సీఎం సావంత్‌ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top