ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న యువ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ భారతీయ యువత విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతున్న యువతను రైళ్లు రద్దు చేసి, రవాణాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. యువతను తక్కువ అంచనా వేయొద్దని, వారిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా శనివారం జరగనున్న సీజేపీ నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైళ్ల రద్దు, మెట్రో సేవల్లో అంతరాయాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో చిరాగ్ శుక్రవారం స్పందించారు. ‘‘వీళ్లు భారతీయ యువత.. వీరిని ఎవరూ ఆపలేరు. ఎన్ని రైళ్లను నిలిపివేస్తారు? ఎంత రవాణాను అడ్డుకుంటారు? ఎన్ని రహదారులను దిగ్బంధిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు.
భారతీయ యువత ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. అయితే, నిరసనల పేరుతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
మరోవైపు, ఎన్నికల్లో గెలవలేక ప్రతిపక్షాలు నిరసనలతో రాజకీయాలు చేస్తున్నాయని చిరాగ్ విమర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పదేపదే నగరాన్ని స్తంభింపజేయడం సరికాదన్నారు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం కంటే ఆందోళనలకే ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అపాయింట్‌మెంట్ కోరాలని, తమ అభ్యంతరాలు, సందేహాలను ఆయన ముందుంచి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు.
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేతగా ఉన్న చిరాగ్ పాశ్వాన్.. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా పార్టీని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, పోటీ చేయాల్సిన స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు ‘యూత్ బోలే తో’ వంటి కార్యక్రమాల ద్వారా వారితో మమేకమవుతున్నారు. యువత సమస్యలు, ఉపాధి, పోటీ పరీక్షల అంశాలపై వారితో చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు


