మమత నివాసంలో సీఐడీ సోదా | CID Searches Mamata Banerjee Residence amid Signature Forgery Probe | Sakshi
Sakshi News home page

మమత నివాసంలో సీఐడీ సోదా

Jun 10 2026 5:01 AM | Updated on Jun 10 2026 6:29 AM

CID Searches Mamata Banerjee Residence amid Signature Forgery Probe

ఫోర్జరీ సంతకాల కేసులో దర్యాప్తు 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. కోల్‌కతా కాళీఘాట్‌ ప్రాంతంలోని మమతా బెనర్జీ నివాసంలోనే పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. ఈ భవనంలోనే సీఐడీ అధికారులు సోదాలుచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి విషయంలో టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీలో చీలిక రావడం తెలిసిందే. 

ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి నోటీసు పంపింది. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఎమ్మెల్యేల నుంచి సంతకాలను సేకరించినట్లు అభిషేక్‌ ఇచ్చిన వివరణ ఆధారంగానే ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా తమ ఎదుట హాజరుకావాలని సీఐడీ నోటీసు పంపించగా అభిషేక్‌ ఢిల్లీ వెళ్లారు.

 సీఐడీ అధికారుల సోదాల విషయం తెలియగానే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్‌ ఘోష్, మదన్‌ మిత్ర అక్కడికి చేరుకున్నారు. అయితే, అధికారులు వారిని లోపలికి రానివ్వలేదు. అనంతరం టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అక్కడికి వచ్చి సీఐడీ అధికారులతో మాట్లాడారు. సీఐడీ తనిఖీలు చట్టవిరుద్ధం, బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కల్యాణ్‌ బెనర్జీ విమర్శించారు. 

సీఐడీ అధికారుల మరో బృందం కోల్‌కతాలోని కామాక్‌ వీధిలో ఉన్న అభిషేక్‌ ఇంటికీ వెళ్లింది. అసెంబ్లీలో పార్టీ నేతను ప్రకటించే విషయంలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వివాదం రాజుకుని చివరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని శాసనసభలో తమ విపక్షనేతగా ఎన్నుకునేదాకా వెళ్లడం తెల్సిందే.  

Advertisement
 
Advertisement
Advertisement