లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను

Chinese PLA soldier captured by Indian Army in Ladakh - Sakshi

దారి తప్పి వచ్చిన అతడిని తిరిగి పంపిస్తామన్న భారత సైన్యం

న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించింది. ‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోని డెమ్‌చోక్‌ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్‌ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు.

అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్‌ఏ కార్పొరల్‌ వాంగ్‌ య లాంగ్‌గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని షాంగ్జిఝెన్‌ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్‌ఏ నుంచి ఒక వినతి అందింది’అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్‌–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది.

‘భారత్‌–చైనా సరిహద్దులు దాటి భారత్‌లోకి అతడు ఎలా రాగలిగాడనే విషయం రాబట్టేందుకు అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటికి అతడిని తిరిగి వెనక్కు పంపించే అవకాశాలున్నాయి’అని పేర్కొంది. భారత్, చైనాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధికార గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. సరిహద్దుల్లో ఇది మరో వివాదానికి తెరతీయబోదనీ, ఈ అంశం పరిష్కారం మరిన్ని ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేస్తుందని వ్యాఖ్యానించింది. పీఎల్‌ఏలో కార్పొరల్‌ హోదా భారత ఆర్మీలో నాయక్‌ స్థాయికి సమానం. కాగా, తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంట ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.

చైనాలో భాగంగా జమ్మూకశ్మీర్‌!
జమ్మూకశ్మీర్‌ చైనాలో భాగం అంటూ ట్విట్టర్‌ చూపడం వివాదాస్పదంగా మారింది. ఈ పొరపాటును వెంటనే సరిచేసినట్లు ట్విట్టర్‌ చెబుతున్నప్పటికీ జమ్మూకశ్మీర్‌ను భారత్‌కు చెందినట్లు చూపకపోవడం, లేహ్‌ ప్రాంతాన్ని కశ్మీర్‌లో అంతర్భాగంగా పేర్కొనడం కొనసాగు తోందని నిపుణులు అంటున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు నితిన్‌ గోఖలే ఆదివారం లేహ్‌లోని హాల్‌ ఆఫ్‌ ఫేంను గురించి ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో లేహ్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందినట్లు, జమ్మూకశ్మీర్‌ చైనాలో ఉన్నట్లు చూపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరిగిందని ట్విట్టర్‌ ఇండియా ప్రతినిధి చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top