టమాట, ఉల్లి ధరలపై కేంద్రం కీలక ప్రకటన

Central Govt Says Tomato Prices Could Fall In December With Arrival Fresh Crop - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరలపై కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ.67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం టమాట ధర పెరిగిందని తెలిపింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాట ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది.

గతేడాది ఇదే సమయానికి 70.12లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిదని, గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లిపాయలు చేరుకుంటున్నాయని,సెప్టెంబర్‌లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రంపేర్కొంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది.

ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రంఅందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top