బొగ్గు కుంభకోణం: బెంగాల్‌ న్యాయ మంత్రిపై సీబీ‘ఐ’

CBI raids West Bengal Law Minister residences in coal pilferage scam - Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా:  బొగ్గు కుంభకోణం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్‌ న్యాయ శాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌ నివాసాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పశ్చిమ బర్దమాన్‌ జిల్లా అసన్‌సోల్‌లోని మూడు ఇళ్లు, కోల్‌కతాలోని రెండు ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి. కోల్‌కతాలో ఘటక్‌ సన్నిహితుడికి చెందిన ఒక ఇంట్లో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్‌ హార్బర్‌లో మరో ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. అసన్‌సోల్‌లో ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌కు చెందిన గనిలో తవ్విన బొగ్గును కొందరు స్వాహా చేసినట్లు ఫిర్యాదు అందడంతో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తోంది. మంత్రి మొలోయ్‌ ఘటక్‌ను కోల్‌కతాలోని ఆయన అధికారిక నివాసంలో సీబీఐ బృందం ప్రశ్నించింది.

బొగ్గు స్మగ్లింగ్‌ కుంభకోణంలో మంత్రిపేరు తెరపైకి వచ్చిందని, ఇందులో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు తమకు సాక్ష్యాధారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. మంత్రి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఘటక్‌ వద్ద పనిచేస్తున్న చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ను కూడా ప్రశ్నించామన్నారు. అసన్‌సోల్‌లో ఘటక్‌ ఇంట్లో బీరువా తాళాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు దాన్ని బద్దలు కొట్టినట్లు తెలిసింది. మంత్రి ఇళ్లల్లో సీబీఐ సోదాల సందర్భంగా కేంద్ర పారామిలటరీ సిబ్బంది భారీగా మోహరించారు. బొగ్గు స్మగ్లింగ్‌ కేసులో ఘటక్‌ గతంలో ఒకసారి ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top