గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన... ఐదు నెలలపాటు పొడిగింపు

Cabinet Approves Extension of PMGKAY for 5 Months - Sakshi

7న ప్రధాని ప్రకటన

బుధవారం కేబినెట్‌ ఆమోదం

నవంబర్‌ వరకు వర్తింపు

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతాచట్టం పరిధిలోని 81.35 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేసేలా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు వర్తింపజేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల ఏడో తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్రమే ఉచిత టీకాలిస్తుందని, నవంబరు వరకు ఉచిత రేషన్‌ను అందజేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉచిత రేషన్‌కు ఆమోదం తెలిపింది.ఈ పథకాన్ని కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో తొలుత 2020 మార్చిలో ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు మూడో విడతలుగా ఈ పథకం అమలైంది. నాలుగో విడతలో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని 81.35 కోట్ల మందికి మరో 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల వంతున ఉచితంగా అదనపు ఆహారధాన్యాలను పంపిణీ చేస్తారు. ఇందుకు రూ. 64,031 కోట్ల మేర ఆహార సబ్సిడీపై వెచ్చించాల్సి వస్తుందని అంచనా.  
 

రైల్‌సైడ్‌ వేర్‌హౌజ్‌ కంపెనీ విలీనం
సెంట్రల్‌ రైల్‌ సైడ్‌ వేర్‌హౌస్‌ కంపెనీ లిమిటెడ్‌ (సీఆర్‌డబ్ల్యూసీ)ను దాని మాతృసంస్థ అయిన సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ (సీడబ్ల్యూసీ)లో విలీనం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top