Bypoll Results: ఉత్తరాఖండ్‌ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం

Bypoll Results: PM Modi Congratulates Pushkar Dhami For Champawat win - Sakshi

Bypoll Results: చంపావత్‌ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్లతో విజయకేతనాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలా గహ్తోరి డిపాజిట్‌ కోల్పోయారు. కాగా ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్‌ సింగ్‌ ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అయ్యింది. కాగా మే 31న ఉత్తరాఖండ్‌, ఒడిశా, కేరళలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్‌ 3న వెలువడ్డాయి.

ధామి గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. చంపావత్‌ నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. అలాగే ‘‘చంపావత్ ఉపఎన్నికలో ఓట్ల ద్వారా మీరు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలతో నా హృదయం చాలా ఉద్వేగానికి లోనైంది. నేను మాట్లాడలేకపోతున్నాను’’ అని తన విజయం తర్వాత ముఖ్యమంత్రి ధామి ట్వీట్ చేశారు.

కేరళలోని త్రిక్కాకర నిజయోకవర్గంలో యూడీఎఫ్‌ అభ్యర్థి ఉమా థామస్ విజయం సాధించారు. ఒడిశాలోని బ్రజరాజ్‌నగర్లో బీజేడీ అభ్యర్థి అలకా మొహంతి గెలుపొందారు. ఉత్తరాఖండ్‌, ఒడిశాలో అధికార పార్టీ అభ్యర్ధులే విజయం సాధించగా.. కేరళలో ప్రతిపక్ష యూడీఎఫ్‌కు విజయం దక్కింది.

గత సాధారణ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గాను 47 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరేసి రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామికి మాత్రం ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన భువన చంద్ర కప్రీ విజయం సాధించారు. అయినప్పటికీ పుష్కర్‌ సింగ్‌ ధామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల్లో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ధామి కోసం చంపావత్ స్థానం నుంచి విజయం సాధించిన హేమేష్ కర్క్‌వాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top