
ఎస్‌ఐఆర్‌తోపాటు ఓట్ల చౌర్యంపై చర్చించాలని విపక్షాల పట్టు
ఆందోళనలు, నినాదాలతో హోరెత్తిన లోక్‌సభ, రాజ్యసభ
ఉభయ సభలు సోమవారానికి వాయిదా
లోక్‌సభలో ‘ఇన్‌కం ట్యాక్స్ బిల్లు–2025’ ఉపసంహరణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. శుక్రవారం సైతం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై ప్రభుత్వం వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో నిరసన వ్యక్తంచేశాయి. దాంతో లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.
లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మృతిపట్ల స్పీకర్ ఓంబిర్లా నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం గురించి ప్రస్తావించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని తేల్చిచెప్పారు. ఈ సమయంలో స్పీకర్ కొంతసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. విపక్షాల రగడ ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాలు ఆగలేదు. విపక్షాల ఆందోళన ఆగకపోవడంతో చేసేది లేక సభాపతి లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఇన్‌కం ట్యాక్స్ బిల్లు–2025’ను ఉపసంహరించుకున్నారు. నూతన బిల్లును ఈ నెల 11 లోక్‌సభలో ప్రవేశపెట్ట బోతున్నారు. ఎస్‌ఐఆర్‌పై సభలో నినానాలు మిన్నంటడంతో స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు.
ఓట్లు చోరీ చేసింది కాంగ్రెస్ నేతలే: రవనీత్ సింగ్ బిట్టూ
బిహార్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌తోపాటు గత లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చౌర్యంపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలపాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. చర్చ కోసం రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన 20 నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. దాంతో విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి యథాతథంగా కొనసాగింది.
ప్రశ్నోత్తరాలకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న ఘన్‌శ్యామ్ తివారీ విజ్ఞప్తి చేయగా, విపక్షాలు పట్టించుకోలేదు. కర్ణాటకలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ డిమాండ్‌చేశారు. ఓట్ల దొంగతనానికి పాల్పడింది కాంగ్రెస్ నేతలేనని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు.