
రైలు పేలుళ్ల కేసు విచారణలో బాంబే హైకోర్టు వ్యాఖ్య
మొత్తం 12 మంది నిందితులకూ విముక్తి కల్పిస్తూ తీర్పు
ముంబై: ముంబైలో 19 ఏళ్ల క్రితం 180 మందికిపైగా ప్రాణాలను బలిగొన్న రైలు పేలుళ్ల కేసులో సోమవారం కీలక పరిణామం సంభవించింది. పోలీసులు నేర నిరూపణలో ఘోరంగా విఫలమయ్యారని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితులు ఈ నేరం చేశారంటే నమ్మడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం మొత్తం 12 మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ‘నిందితుల నేరాంగీకార ప్రకటనలు ఏమా త్రం ఆమోదయోగ్యంగా లేవు. అవన్నీ కాపీ చేసినట్లుగా కనిపిస్తున్నాయి.
నేరం అంగీకరించాలంటూ పోలీసులు తమను తీవ్రంగా హింసించారని పేర్కొనడం ద్వారా నిందితులు నేరాంగీకార విశ్వసనీయతను మరింత దెబ్బతీశారు’అని వ్యాఖ్యానించింది. నేరానికిగాను ఏ రకం బాంబులు వాడారనే విషయం కూడా పోలీసులు చెప్పలేకపోయారని, సేకరించిన ఆధారాలు నేరనిరూపణకు సరిపోయేవి కావంది. ‘బాంబులు, సర్క్యూట్ బాక్సుల వంటి స్వాధీనమైన వస్తువులకు సరిగ్గా సీళ్లు వేయలేదు. వాటిని జాగ్రత్తగా భద్రపర్చలేదు.
కీలకమైన సాక్షులను ప్రశ్నించడంలోనూ విఫలమైంది’అంటూ ప్రాసి క్యూషన్ తీరుపై విరుచుకుపడింది. నిందితులకు న్యాయపరమైన సాయం అందించకుండానే నేరాంగీకార ప్రకటన రికార్డు చేయడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. నిందితుల నేరాంగీకార స్టేట్‌మెంట్లలో ఏమాత్రం స్పష్టత లేదంది. పేలుళ్ల కేసుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆప్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్(మోకా)ను వాడకపోవడాన్ని ఎత్తి చూపింది.
‘అసలైన నేరస్తుడిని శిక్షించడం నేర కార్యకలా పాలను అరికట్టడానికి, చట్టాన్ని నిలబెట్టడానికి, పౌరుల భద్రతను నిర్ధారించే దిశలో ఒక ముఖ్య మైన అడుగు’అని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌ల ధర్మాసనం తన 671 పేజీల తీర్పులో పేర్కొంది. ‘అందుకు విరుద్ధంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా, సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపేలా ప్రాసిక్యూషన్ వ్యవహరించింది. అసలైన ముప్పు ఇప్పటికీ తొలగలేదనే విషయం ఈ కేసుతో తేటతెల్లమైంది’అని మండిపడింది. ‘నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది.
నిందితులు నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టం. అందుకే వారిపై ఆరోపణలను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. రైళ్లలో బాంబులు అమర్చడం తదితర నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ప్రకటించిన నలుగురితోపాటు జీవిత కాల జైలు శిక్షలు పడిన ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరిలో మరణ శిక్ష పడిన కమాల్ అన్సారీ 2021లో జైలులోనే చనిపోయాడు. మహానగరం ముంబైలోని స్థానిక రైళ్లు ఏడింటిలో 2006 జూలై 11న పేలుళ్లు సంభవించాయి. ఘటనల్లో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
