
కర్ణాటకలోని కోలారు మహిళ ప్రత్యేకం
ఏ గ్రూప్‌తోనూ సరిపోలని ఆమె రక్తం నమూనాలు
ఇంగ్లండ్‌లోని అంతర్జాతీయ ల్యాబ్ కూడా చేతులెత్తేసింది
జిల్లా ఆస్పత్రి డాక్టర్ వెల్లడి
కోలారు: కర్ణాటకలోని కోలారు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ రక్తం గ్రూపు చాలా ప్రత్యేకమైనదిగా తేలింది. ఏ గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలలేదని స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యనిపుణులు డాక్టర్ డీవీఎల్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ మహిళ గుండె శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని.. ఆమె బ్లడ్ గ్రూపును గుర్తించేందుకు పరీక్ష చేయగా బ్లడ్‌బ్యాంకులోని ఏ రక్తం గ్రూపుతోనూ ఆమె రక్తం సరిపోలేదన్నారు.
ఆమె రక్త నమూనాలను బెంగళూరులోని మెడికల్ సర్వీసెస్ ట్రస్టుకు, ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ నగరంలోని అంతర్జాతీయ ల్యాబొరేటరీకి పంపించి ఏ గ్రూపు రక్తమో కనుక్కోవాలని కోరామని.. ఇంతవరకూ ఇలాంటి గ్రూపు రక్తం ఏదీలేదని నివేదిక వచ్చిందని డాక్టర్ ప్రసాద్ వెల్లడించారు.

చివరకు.. ఈ రక్తం గ్రూపునకు స్థానిక పేరు వచ్చేలా క్రోమర్ ఇండియా బెంగళూరు (సీఆర్‌ఐబీ)గా వారే పేరు పెట్టారని, బెంగళూరుకు బదులు కోలారు అని పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కె.ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ వినుతా శంకర్ తదితరులు పాల్గొన్నారు.