రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌ వివాదం

Blocked hashtag calling for PM Narendra Modi resignation by mistake - Sakshi

కొన్ని గంటలు బ్లాక్‌ చేసిన ఫేస్‌బుక్‌

పొరపాటున జరిగిందని వివరణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వమే ఈ సంక్షోభానికి కారణమంటూ రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్‌బుక్‌ ఈ హ్యాష్‌ట్యాగ్‌ పోస్టులను కొన్ని గంటలసేపు బ్లాక్‌ చేయడం కలకలం రేపింది. అయితే ఆ తర్వాత హ్యాష్‌ట్యాగ్‌ను పునరుద్ధరించిన ఫేస్‌బుక్‌ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఈ పని చేయలేదని, పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చింది. ‘‘మేము తాత్కాలికంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను బ్లాక్‌ చేశాము. ఇది మా పొరపాటే తప్ప కేంద్రం మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పొరపాటున గుర్తించిన వెంటనే దానిని పునరుద్ధరించాం’’అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

రిజైన్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌ని బ్లాక్‌ చేసినట్టుగా మొట్టమొదట అమెరికాకి చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయటపెట్టింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులను నిరోధించడం సామాజిక మాధ్యమాలకు ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ట్విటర్‌ వాటిని ఫేక్‌ న్యూస్‌ అని పేర్కొంటూ కొన్ని వేల ప్రభుత్వ వ్యతిరేక మెసేజ్‌లను తొలగించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించాలంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది ‘‘ఇలాంటి సంక్షోభ సమయాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమైనది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వైద్యులతో సమానంగా మీడియా కూడా కరోనాపై పోరాటంలో పాల్గొనాలి. మనందరం సమష్టిగా పోరాటం చేయాలి’’అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top