
పాట్నా: భారీ వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న బిహార్‌కు పాట్నా వాతావరణ కేంద్రం మరో చేదు వార్తను అందించింది. ఆగస్టు 1 వరకు ఇంకా ఎక్కువ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఆ వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 11 జిల్లాల్లోని కొత్త ప్రాంతాలకు వరదనీరు చేరుతుందని దీని వలన మరో మిలియన్ జనాభా ఇబ్బందులు ఎదుర్కొంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
చదవండి: అస్సాంలో వరదలు..104 మంది మృతి
ఇప్పటికే బిహార్‌లోని 38 జిల్లాల్లో 11 జిల్లాల్లోని మొత్తం 2.4 మిలియన్ల మంది ప్రజలు వరదలకు గురయ్యారని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. దర్భాంగా ఎక్కువగా ప్రభావితమైందని ఒక బులెటిన్‌లో పేర్కొంది. సీతామార్హి, షియోహార్, సుపాల్, కిషన్గంజ్, దర్భాంగా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, ఖాగారియా, సరన్ ప్రాంతాలను వరద ప్రభావిత జిల్లాలుగా పేర్కొంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ, 24 గంటలు పరిస్థితులను పరిశీలిస్తున్నామని, అధికారలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 17 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఎనిమిది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందాలు రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
చదవండి: ఉత్తరాఖండ్‌లో వరదలు: ముగ్గురు మృతి