బిహార్‌ నుంచి కోల్‌కతాకు.. 10 నిమిషాల ఆలస్యంతో

Bihar Boy Travels 700 km To Reach NEET Centre Misses Exam by 10 Minutes - Sakshi

10 నిమిషాల ఆలస్యం వల్ల నీట్‌ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి

పట్నా: ‘‘మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష మొదలైంది. నిజానికి నేను ఒంటి గంట నలభై నిమిషాలకు అక్కడికి చేరుకున్నాను. కానీ సెంటర్‌కు 10 నిమిషాల అలస్యమైందన్న కారణంతో నన్ను లోపలికి అనుమతించలేదు. అధికారులను ఎంతగానో బతిమిలాడాను. వాళ్లు నా అభ్యర్థనను మన్నించలేదు’’ అంటూ సంతోష్‌ కుమార్‌ యాదవ్‌ అనే విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కఠిన శ్రమకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా లాభం లేకుండా పోయిందని ఉద్వేగానికి లోనయ్యాడు. పది నిమిషాల ఆలస్యం తనను నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌‌)కు దూరం చేసిందని, దీంతో ఏడాది సమయం వృథా అయిందని వేదన చెందాడు. వివరాలు.. బిహార్‌లోని దర్బంగాకు చెందిన సంతోష్‌ కోల్‌కతా లో నీట్‌ పరీక్ష రాసేందుకు ఏకంగా 700 కి.మి ప్రయాణం చేశాడు. శనివారం ఉదయం 8 గం బస్సు ఎక్కి ముజఫర్‌పూర్‌ చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పట్నాకు వెళ్లే బస్సు ఎక్కాడు. (చదవండి: విషాదం: ఎస్సై కూతురు ఆత్మహత్య)

ఈ క్రమంలో ట్రాఫిక్‌ అంతరాయం వల్ల ఆరు గంటలు ఆలస్యమైంది. దీంతో పట్నాలో 9 గంటలకు బస్సు ఎక్కి రాత్రి ఒంటి గంటకు కోల్‌కతాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ట్యాక్సీలో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. కానీ అప‍్పటికే పది నిమిషాలు ఆలస్యమైనందున అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో సంతోష్‌ పడిన శ్రమకు ఫలితం లేకుండా పోయింది. కాగా గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిమిషం ఆలస్యం వల్ల కూడా అనేక మంది విద్యా సంవత్సరా​న్ని కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. కాగా అనేక విమర్శల నడుమ కరోనా విజృంభిస్తున్న వేళ భద్రత, వైద్య పరీక్షల నిమిత్తం విద్యార్థులు మూడు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నీట్‌ పరీక్ష నిర్వాహకులు సూచించిన విషయం తెలిసిందే. 

ఇక నీట్‌ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక కొన్నిరోజుల క్రితం మదురైకి చెందిన 19 ఏళ్ల యువతి,  మరో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో అక్కడి ప్రతిపక్ష పార్టీలు నీట్‌ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సామాజిక కార్యక​ర్తలు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో రవాణా వ్యవస్థ లేకపోడం, వరదల కారణంగా విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్న తరుణంలో నీట్‌ పరీక్ష నిర్వహణ తీవ్ర విమర్శలకు దారితీసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top