బిహార్‌లో పాఠశాల త్రైమాసిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, బక్సర్‌లోని ఓ విద్యా కేంద్రంలో ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పరీక్షా సామగ్రి నిర్వహణ తీరు ఉండాల్సింది ఇలాగేనా? అని విమర్శలు వస్తున్నాయి.
ఈ ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాలను 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల కోసం బిహార్ బోర్డు పంపింది. అవి బక్సర్‌లోని బునియాది పాఠశాలకు చేరాయని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.
వైరల్ దృశ్యాలు.. ప్రజల్లో ఆగ్రహం
అయితే, భారీ వర్షంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు నీటిలో పడి కనిపించాయి. ఇంత కీలకమైన పరీక్షా సామగ్రిని వర్షంలో నిర్లక్ష్యంగా వదిలేశారని పలువురు అధికారులపై విమర్శలు చేశారు.
ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి. సున్నితమైన పరీక్షా సామగ్రి వర్షంలోకొట్టుకుపోయేలా ఎలా చేశారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. చాలామంది దృష్టిలో ఈ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకగా మారింది. మరోవైపు, పరీక్షా సామగ్రికి ఎలాంటి నష్టం జరగలేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అకస్మాత్తుగా వర్షం పడటంతో కట్టలు నీటిలో కనిపించినా, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని, పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.


