ప్రజ్వల్‌ రేవణ్ణ స్కాండల్‌ కేసులో 2 బిగ్‌ ట్విస్టులు | Sakshi
Sakshi News home page

ప్రజ్వల్‌ రేవణ్ణ స్కాండల్‌ కేసులో 2 బిగ్‌ ట్విస్టులు

Published Fri, May 10 2024 10:34 AM

Big Twists In Karnataka's Prajwal Revanna Scandal

బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే  వ్యబిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు.

‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు. వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. 

‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్‌డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు.

మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్‌పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.

దేవరాజ్‌ గౌడ్‌పైనా లైంగిక దాడి కేసు
ఇక ప్రజ్వల్‌ ఎపిసోడ్‌లో ఊహించని మరో మలుపు చోటు చేసుకుంది. ఈ భాగోతం మొత్తం బయటపెట్టిన బీజేపీ నేత, ప్రముఖ లాయర్‌ దేవరాజ్‌ గౌడపైనా లైంగిక దాడి కేసు ఒకటి నమోదు అయ్యింది.  హోలెనరసిపురా టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ 1వ తేదీన కేసు నమోదు అయ్యింది. అంతకు ముందురోజు ఆమె భర్త.. గౌడ తమ ఇంటికి వచ్చి బెదిరించాడనే ఫిర్యాదు చేశారు.

తమకు సంబంధించిన ఆస్తుల అమ్మకాల విషయంలో సాయం చేస్తానని గౌడ నమ్మించారని, ఆ వంకతో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా పోలీసులను ఆశ్రయించారు .

ప్రజ్వల్‌ సెక్స్‌ వీడియో క్లిప్‌ల పెన్‌ డ్రైవ్‌లను బీజేపీ అధిష్టానానికి దేవరాజ్‌ గౌడే అందించారని, వచ్చే లోకసభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు వద్దని వారించింది ఈయనేనని ఒక ప్రచారం ఉంది.  
 

Advertisement
 
Advertisement