డీకేకు బిగ్‌ రిలీఫ్‌.. 24 గంటల్లోనే మారిన సీన్‌! | Big Relief For DK Shivakumar: Ramalinga Reddy Takes Back Resignation | Sakshi
Sakshi News home page

డీకేకు బిగ్‌ రిలీఫ్‌.. 24 గంటల్లోనే మారిన సీన్‌!

Jun 6 2026 7:39 PM | Updated on Jun 6 2026 8:12 PM

Big Relief For DK Shivakumar: Ramalinga Reddy Takes Back Resignation

బెంగళూరు: తీవ్ర రాజకీయ చర్చలు, పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాల అనంతరం కాంగ్రెస్ నాయకుడు రామలింగారెడ్డి శనివారం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోనే కొనసాగనున్నారు. దీంతో కర్ణాటకలో పెద్ద రాజకీయ సంక్షోభం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అసమ్మతి చెలరేగింది.

తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, బెంగళూరు నియోజకవర్గాలతో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా రామలింగారెడ్డికి బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించారు. కానీ రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

ఈ క్రమంలో సీఎం డీకే శివకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించడంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. ఈ సమస్య పరిష్కారమైందని తెలిపిన డీకే.. పార్టీలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ‘‘రామలింగారెడ్డి నా మిత్రుడు. సమస్యలన్నీ సద్దుమణిగాయి. కథలు సృష్టించకండి.. ఆ కథలన్నీ పాతబడిపోయాయి. రాజీనామా వ్యవహారం ముగిసిన అధ్యాయం’’ అంటూ డీకే వ్యాఖ్యానించారు.

మంత్రివర్గ శాఖల కేటాయింపులు జరిగిన కొన్ని గంటల్లోనే రామలింగారెడ్డి తన రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘నాకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ మధ్యతరహా నీటిపారుదల శాఖను ఇచ్చారు. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను పనిచేయలేను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు వేరే దారి ఏముంది? రెండుసార్లు నన్ను పిలిచి ఆ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ చివరకు అది వేరొకరికి దక్కింది.

..అందుకే నేను బాధపడ్డాను. అందుకే రాజీనామా చేస్తున్నాను. పదవికి రాజీనామా చేసినప్పటికీ, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. ఎమ్మెల్యేగా కొనసాగుతాను’’ అని ఆయన స్పష్టం చేశారు ఈ వారమే బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎదురైన మొదటి పెద్ద రాజకీయ సవాలు ఇదే. అయితే, పార్టీ అధిష్టానం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో రామలింగారెడ్డి మంత్రివర్గంలోనే కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement