'సుప్రీం' కమిటీ నుంచి తప్పుకున్న భూపీందర్ సింగ్

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత దేశపు అత్యున్నత న్యాయ స్థానం నియమించిన కమిటీ నుంచి భారతీయ కిసాన్ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మాన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీలో మాన్ ముఖ్యులు. కమిటీ సభ్యుడిగా తనను నామినేట్ చేసినందుకు, ఆయన అత్యున్నత న్యాయ స్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాన్ మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాల విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని, రైతు శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని మాసాలుగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నలుగురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో అనిల్ ఘన్వాట్, అశోక్ గులాటి, భూపీందర్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషీల సభ్యులు. కాగా, కమిటీలోని నలుగురు సభ్యులూ నూతన చట్టాలకు అనుకూలంగా ఉన్నవారేనంటూ రైతు సంఘాలు ఆక్షేపించటంతో, భూపీందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి