బంగారంలాంటి దేశాన్ని నాశనం చేశారని ఆగ్రహం

Bengal CM Mamata Benarjee Funny Counter to BJP Leaders - Sakshi

కోల్‌కత్తా: బంగారంలాంటి భారతదేశాన్ని నాశనం చేసిన బీజేపీ.. ఇప్పుడు బెంగాల్‌ను బంగారంలా మారుస్తామ‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌గా మారుస్తామంటూ బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ముఖాలు ఒకసారి అద్దంలో చూసుకోవాలని బీజేపీ నాయకులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ప‌శ్చిమ‌బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శల జోరు కొనసాగుతోంది.

నువ్వానేనా అన్నట్టూ ఆ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీలు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో నిర్వహించిన ఓ సమావేశంలో మమతా బీజేపీపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ ల‌క్ష్యంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదని, ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే స‌త్తా మ‌రే పార్టీకి లేద‌ని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ విక్రయానికి పెట్టిందని మమత ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌‌ పార్టీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాహిత పాలనను అందిస్తున్న‌ద‌ని పేర్కొన్నారు.

బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ముందు బీజేపీ నేత‌లు ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని హేళ‌న చేశారు. బీజేపీ నాయకులే తిరుగుబాటుదారులని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై, రైతుల ఉద్యమం విషయమై బీజేపీని విమర్శించారు. ఈ విధంగా బెంగాల్‌లో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎంసీ, బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ.. తొలిసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఆరాట పడుతోంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top