దాల్‌ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం

Bangladeshi tourists killed in Dal Lake blaze in Kashmir - Sakshi

హౌస్‌బోట్లలో చెలరేగిన మంటలు

ముగ్గురు పర్యాటకులు సజీవదహనం

మృతులంతా బంగ్లాదేశీయులే

ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉంటుందన్న అధికారులు

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్‌ సరస్సు హౌస్‌బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్‌ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్‌ మొయినుద్, దాస్‌ గుప్తా అని తెలిసిందన్నారు.  వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్‌ పూర్తిగా దగ్ధమైందన్నారు.

డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్‌బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్‌ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్‌లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఫైర్‌ సర్వీస్‌) ఫరూక్‌ అహ్మద్‌ తెలిపారు.

ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్‌ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్‌ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్‌బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top