బాబ్రీ విధ్వంసం: నిందితులంతా నిర్దోషులే

Babri Masjid Demolition Case Verdict Live Updates - Sakshi

బలమైన ఆధారాలు లేవు

నిందితులంతా నిర్దోషులే

న్యూఢిల్లీ/లక్నో: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని, పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని పేర్కొంది. లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్‌ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తుది తీర్పును చదివి వినిపించారు. ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్‌ కాపీని రూపొందించారు. కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో తుది తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో బీజేపీ నాయకులు, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులకు భారీ ఊరట  లభించింది.

కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్‌ కతియార్, సాక్షిమహారాజ్‌, ధరమ్‌దాస్‌, రామ్‌ విలాస్‌ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక  మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌‌ సింగ్‌, సతీశ్‌ ప్రధాన్‌, గోపాల్‌ దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. మిగతా ముద్దాయిలంతా లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు. ఉమా భారతి కరోనా సోకగా, వయో భారం, అనారోగ్యం కారణంగా ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి సైతం న్యాయస్థానం ఎదుట స్వయంగా హాజరుకాలేకపోయారు.

అప్రమత్తమైన కేంద్రం.. 
దేశ వ్యాప్తంగా ప్రకంననలు రేపిన 1992 నాటి బాబ్రీ ఘటన తీర్పు నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.  శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఇక 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ  351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. 


కఠిన చర్యలు తప్పవు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడతున్న క్రమంలో హైదరాబాద్‌ పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top