
తరచూ ప్రకటనలపై 70% మంది మాట
కేబుల్ టీవీ, ఓటీటీ యాడ్స్‌పైనే విశ్వాసం
బ్రాండ్స్‌పై అవగాహనకు ఇవే ప్రధానం
టీవీ చూస్తున్నప్పుడు ప్రకటనలు రావడం సహజం. మనం చూస్తున్న ఛానల్‌లో కొన్ని యాడ్స్ పదేపదే ప్రత్యక్షం అవుతుంటాయి. ఇలా ఒకే ఛానల్‌లో ఎక్కువసార్లు ప్రసారం కావడంతో ప్రేక్షకులు విసిగిపోతారు. సింపుల్‌గా ఛానల్ మారుస్తారు. ప్రకటన ప్రభావమేకాదు యాడ్స్‌పట్ల వీక్షకుడికి శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం పదేపదే వచ్చే ప్రకటనల కారణంగా 70% మంది భారతీయ వినియోగదారులు విసిగిపోతున్నారట. ఇలా యాడ్స్‌తో విసుగుచెందుతున్న వారి సంఖ్య శాతం పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.
చూస్తున్న ఛానల్‌లో పదేపదే ఒకే యాడ్ వస్తే సహజంగానే ఎవరికైనా విసుగొస్తుంది. ఇలా విసుగుచెందుతున్న వారి అంతర్జాతీయ సగటు 68 శాతం ఉందని యాడ్స్ టెక్నాలజీ కంపెనీ ‘ది ట్రేడ్ డెస్క్’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఇలా అత్యధికంగా విసుగు చెందినవారితో ప్రపంచంలో యూఎస్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉన్నాయి. ప్రకటనలపట్ల నిరాసక్తత పెరుగుతున్న నేపథ్యంలో బ్రాండ్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను నివేదిక వివరించింది.
ఐదుకుపైగా ఛానళ్ల వీక్షణం
కేబుల్ టీవీ, ఓటీటీ.. వేదిక ఏదైనా సినిమాలు, వెబ్ సిరీస్, సంగీతం, వార్తలు, గేమింగ్.. ఇలా విభిన్న మాధ్యమాల కోసం సగటున ఒక్కో వ్యక్తి రోజుకు 5.4 మీడియా ఛానళ్లను వీక్షిస్తున్నారట. ఇందుకు 9 గంటలు సమయం వెచ్చిస్తున్నారు. ఆడియోతో స్వల్వ, దీర్ఘకాలంలో ప్రకటనలు గుర్తుండిపోతున్నాయి. వినియోగదారులకు మరింత ప్రభావశీలమైన అనుభవాన్ని అందించగలిగితే.. ప్రకటన పట్ల ఉన్న విసుగును 2.2 రెట్లు తగ్గించడంతోపాటు ఉత్పాదన కొనుగోలు చేసేలా ఒప్పించే ప్రభావం 1.5 రెట్లు పెరుగుతుందని నివేదిక తెలిపింది.
కేబుల్ టీవీ, ఓటీటీలతో..
» బ్రాండ్స్ గురించి తెలుసుకోవడానికి కేబుల్ టీవీ, ఓటీటీలు ప్రధాన మాధ్యమాలుగా నిలిచాయి. వీటిద్వారా బ్రాండ్స్‌ను తెలుసుకున్నామని 73 శాతం భారతీయులు చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 51 శాతం మాత్రమే.
» ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ సేవలను మనదేశంలో 72% మంది సబ్‌స్క్రైబ్ చేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 42%.
» భారత్‌లో 18–34 ఏళ్ల వయసువారిలో 55% మంది ఒకే ప్లాట్‌ఫామ్‌పై కాకుండా ప్రీమియంగా భావించి కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రకటనలు గుర్తుపెట్టుకుంటున్నారు
» వీక్షిస్తున్నప్పుడు కొత్త బ్రాండ్స్, సేవలు, ఉత్పత్తులను 73% మంది గుర్తించారు.
» ఇతర మాధ్యమాలతో పోలిస్తే 66% మంది కేబుల్ టీవీ, ఓటీటీ ప్రకటనలను విశ్వసిస్తున్నారు.
» కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనల్లో కనపడిన ఉత్పత్తులను 69% మంది గుర్తు చేసుకుంటున్నారు.
» 47% మంది.. పోస్టర్లు, బిల్‌బోర్డులు లాంటి డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ (డీఓఓహెచ్) మీడియాను గుర్తిస్తున్నట్టు, అవి తమకు గుర్తుంటున్నాయని చెప్పారు.
» ప్రకటనలు వింటున్న 86% సందర్భాలలో కస్టమర్లు మమేకం అవుతున్నారు.
» జెన్ జీ (1997–2012 మధ్య పుట్టినవారు)లో 75% మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇష్టపడుతున్నారు.