ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి

Aryan Khan Case NCB Witness Prabhakar dies Due To Heart Attack - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ ప్రధాన సాక్షి మృతిచెందాడు. ఈ కేసులో  నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో కన్నుమూశాడు.

శుక్రవారం మధ్యాహ్నం ముంబై పరిధిలోని చెంబూర్‌లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో అతను చనిపోయినట్లు తెలుస్తోంది.  2021లో నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్‌ ఇండిపెండెంట్‌ విట్‌నెస్‌గా ఉన్నాడు. ప్రభాకర్‌ మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని అతని కుటుంబం ధృవీకరించిన విషయాన్ని ప్రభాకర్‌ తరపు న్యాయవాది తుషార్‌ ఖాండేర్‌ వెల్లడించారు.  ప్రభాకర్‌కు తల్లి, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

కేపీ గోసావీ అనే వ్యక్తి దగ్గర ప్రభాకర్‌ సెయిల్‌ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ముంబై క్రూయిజ్‌ పార్టీలో గోసావీ కూడా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో సాక్షి సామ్‌ డీసౌజా, గోసావీ-ప్రభాకర్‌ల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. వాళ్లు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించాడు. అయితే ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేతో పాటు ఎన్సీబీ పైనా అవినీతి ఆరోపణలు చేశాడు ప్రభాకర్‌. ఈ నేపథ్యంలో అన్ని ఆరోపణల మీద విచారణ జరుగుతోంది.  ఈలోపే ప్రభాకర్‌ గుండె పోటుతో చనిపోవడం.. కేసును మలుపు తిప్పే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

గతేడాది అక్టోబర్‌లో ముంబైలో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ముంబై తీరంలో కార్డీలియా క్రూయిజ్‌ లైనర్‌ అనే నౌకపై ఎన్సీబీ అధికారులు దాడులుచేశారు. రేవ్ పార్టీ జరుగుతోందని, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో సోదాలు చేశారు. క్రూయిజ్‌లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొలి అరెస్ట్‌ ఆర్యన్‌ ఖాన్‌దే కావడం విశేషం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top