
ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ ప్రకటన
ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకే అని స్పష్టీకరణ
నష్టపోనున్న కాంగ్రెస్, ఆర్‌జేడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం విపక్ష ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చే కీలక ప్రకటన చేశారు. వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఉద్దేశించింది మాత్రమేనని పేర్కొన్నారు. ‘ఆప్ బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకు మాత్ర మే. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు లేదు. పొత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లోని విశావదర్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసింది.
కాంగ్రెస్ కేవలం ఆప్‌ను ఓడించేందుకు పోటీ చేసింది. ఆప్‌ను ఓడించేందుకు, ఓట్లను తగ్గించేందుకు కాంగ్రెస్‌ను బీజేపీ పంపింది’అని అహ్మదాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ఆప్ తన ఎన్నికల అరంగేట్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టిందన్నారు. తమ నిర్ణయం ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను సవాల్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా అభివరి్ణంచారు. అదే సమయంలో గుజరాత్‌లో ఆప్ రాజకీయ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గుజరాత్‌లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. అయినప్పటికీ బీజేపీ పదేపదే గెలుస్తోంది. దీనికి కారణం అక్కడ బలమైన ప్రత్యామ్నా యం లేకపోవడమే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ జేబులో ఉంది. ఒకవిధంగా బీజేపీని గెలిపించే కాంట్రాక్ట్‌ను కాంగ్రెస్ తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలవరని, గెలిచినా బీజేపీలోకి వెళ్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఆప్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గుజరాత్‌ను మొదటి 30 ఏళ్లు కాంగ్రెస్, తర్వాత 30 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇప్పుడు ఆప్‌కు అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు దెబ్బే
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్ సైతం ఈ ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశముంది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బిహార్‌లో ప్రజల వద్దకు వెళ్తామని, పట్టణ పేదలు, గ్రామీణుల ప్రజలను చేరుకునేలా తమ వ్యూహం ఉంటుందని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు.
ఆప్ నిజంగా అదే వ్యూహంతో ముందుకెళితే ఇండియా కూటమి ఓట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయి. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఇండియా కూటమి 9 స్థానాలను గెలుచుకుంది. ఆప్ పోటీలో నిలిస్తే కాంగ్రెస్, ఆర్‌జేడీ ఓట్ల వాటాను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇది పరోక్షంగా ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 52 శాతం, ఇండియా కూటమి 42 శాతం ఓట్లను సాధించాయి.
ఇప్పుడు ఆప్ పోటీలో ఉంటే ఇండియా కూటమికు నష్టం జరిగే అవకాశం ఉంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతాయ పార్టీల ఆధిపత్యం ఉండే బిహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్ నిర్ణయం ఇండియా కూటమికి నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు సైతం లెక్కలు వేస్తున్నారు. ఆప్ కనీసంగా 5–10శాతం ఓట్లు సాధించినా, అది ఎన్డీఏకే కలిసొస్తుందని అంటున్నారు. ఈ ఓట్ల శాతం రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా తనను ప్రకటించుకునేందుకు ఆప్‌కు దోహదపడుతుందని భావిస్తున్నారు.