20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్‌ దురాగతం

Army officer staged Shopian encounter for Rs 20L - Sakshi

శ్రీనగర్‌: గత ఏడాది జూలై 18న కశ్మీర్‌లోని అంషిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్‌ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. నగదు రివార్డు రూ.20 లక్షల కోసం ఆశపడిన 62–రాష్ట్రీయ రైఫిల్స్‌ రెజిమెంట్‌ కెప్టెన్‌ భూపేందర్‌ సింగ్‌ ముగ్గురు అమాయకులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేసినట్లు తేలింది. ఈ ఘటనలో అతడికి ఇద్దరు స్థానికులు సాయపడినట్లు కూడా సిట్‌ గుర్తించింది. ఈ మేరకు 300 పేజీల చార్జిషీటును షోపియాన్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సికందర్‌ అజామ్‌కు గత డిసెంబర్‌ 26న సమర్పించింది. ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్న షోపియాన్‌కు చెందిన తబిష్‌ నాజిర్, పుల్వామా వాసి బిలాల్‌ అహ్మద్‌లతో కలిసి కెప్టెన్‌ భూపేందర్‌ సింగ్‌ పథకం వేశాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ మరో నలుగురు జవాన్లను తీసుకుని అంషిపొరా వెళ్లారు.

నలుగురు జవాన్లు కార్డాన్‌ సెర్చ్‌ చేపడుతున్న సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వారికి వినిపించింది. ఆ ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్చినట్లు అనంతరం సింగ్‌ వారితో నమ్మబలికాడు. ముగ్గురినీ కాల్చి చంపిన అనంతరం వారిని గుర్తు పట్టకుండా చేసి, ఆయుధాలు ఉంచాడు. మృతులు అబ్రార్‌ అహ్మద్‌(25), ఇంతియాజ్‌ అహ్మద్‌(20), మొహమ్మద్‌ ఇబ్రార్‌(16)ల ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యాయి. ఆపిల్‌ తోటల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలుగా వారిని గుర్తించారు. ఖననం చేసిన మృతదేహాలను అక్టోబర్‌ 3వ తేదీన కుటుంబసభ్యులకు అందజేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆర్మీ కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చేపట్టింది. దీనిపై ఏర్పాటైన సిట్‌ 75 మందిని ప్రశ్నించింది.

అనుమానితుల కాల్‌ రికార్డును పరిశీలించింది. నగదు రివార్డు కోసమే భూపేందర్‌ సింగ్, స్థానిక ఇన్‌ఫార్మర్లు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు గాను వారికి కొన్ని వేల రూపాయలు ముట్టినట్లు కూడా తేలింది. రూ.20 లక్షల రివార్డు కోసం తమ అధికారి బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తలపై సైన్యం స్పందించింది. అవి సైనిక వ్యవస్థలోని వాస్తవాల ఆధారంగా వస్తున్న వార్తలు కావని పేర్కొంది. ‘యుద్ధ క్షేత్రంలో గానీ, ఇతర విధుల్లో గానీ పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి నగదు రివార్డులు అందజేసే విధానం లేదని శ్రీనగర్‌లోని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top